న్యూఢిల్లీ, జూలై 17 : పశ్చిమాసియా సంక్షోభం, వర్షాభావ పరిస్థితులు.. దేశ ఆర్థిక వృద్ధిరేటుకు ఇప్పుడు పెను సవాళ్లుగా పరిణమించాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆందోళన వ్యక్తం చేశారు. ‘అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులున్నా భారత్‌లో జీడీపీ వృద్ధిరేటు గడిచిన కొన్నేండ్లుగా 7 శాతంపైనే నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2025-26) కూడా బలమైన స్థూల ఆర్థిక మూలాలతో 7.7 శాతం జీడీపీ వృద్ధిని సాధించాం’ అని తాజాగా డీడీ న్యూస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మల్హోత్రా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గల్ఫ్ వార్, ఎల్ నినో ప్రభావాలున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) దేశ జీడీపీని 6.6 శాతంగా అంచనా వేస్తున్నట్టు మల్హోత్రా తెలిపారు. ‘ద్రవ్య, ఆర్థిక విధానాలు పటిష్టంగా ఉన్నాయి.
అందుకే దేశ జీడీపీ వృద్ధిరేటు అధికంగా నమోదవుతున్నది’ అన్నారు. ఇక ద్రవ్యోల్బణంపై స్పందిస్తూ.. ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 5.1 శాతానికి పెంచామని, గత అంచనా 4.6 శాతం కంటే ఇది ఎక్కువని చెప్పారు. నిజానికి ద్రవ్యోల్బణం అదుపునకు సంబంధించి ఆర్బీఐ లక్ష్యం 4 శాతమేనని ఆయన గుర్తుచేశారు. కానీ సరఫరా సంబంధిత ఆటంకాలతో జూన్‌లో ధరల సూచీ పరుగులు పెట్టినట్టు వివరించారు. మే నెలతో పోల్చితే గత నెలలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.93 శాతం నుంచి 4.38 శాతానికి పెరిగినట్టు తెలిపారు. ఆహారోత్పత్తులు ఖరీదెక్కడమే ప్రధాన కారణమన్నారు. అంతకుముందు నెలతో చూస్తే జూన్‌లో 4.78 శాతం నుంచి 5.32 శాతానికి ఆహార ద్రవ్యోల్బణం పెరిగిందని వెల్లడించారు.
దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడంలో వర్షాలది కీలకపాత్రని గవర్నర్ మల్హోత్రా ఈ సందర్భంగా అన్నారు. దేశ జనాభాలో ఎక్కువమంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారని గుర్తుచేశారు. భారత జీడీపీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 17 శాతంగా ఉన్నదని తెలిపారు. అలాంటి ఈ వ్యవసాయానికి వర్షాలే ఆధారమని, అయితే ఇప్పుడు వర్షాలు ఆశించిన స్థాయిలో కురువడం లేదని ఒకింత ఆందోళన వెలిబుచ్చారు. ఈ విషయంలో మనమంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలావుంటే దేశ ఆర్థిక వృద్ధిరేటుకు మద్దతిస్తూనే ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ ప్రాధాన్యతనిస్తుందని గవర్నర్ స్పష్టం చేశారు. తక్కువ, స్థిరమైన ద్రవ్యోల్బణం.. భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదిని వేయగలవని అభిప్రాయపడ్డారు.
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తకర వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. గల్ఫ్ దేశాల్లో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తికి ఇది అంతరాయం కలిగిస్తుండగా.. గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లీ విజృంభిస్తున్నాయి. భారత ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా, ఇందులో మెజారిటీ వాటా గల్ప్ దేశాల నుంచి వచ్చేదే. ఈ క్రమంలో అక్కడ నెలకొన్న అశాంతి.. భారత్‌కు ఇందన కష్టాలను తెచ్చిపెడుతున్నది. అలాగే ద్రవ్యోల్బణం ముప్పు, వడ్డీరేట్ల పెరుగుదల, కీలక రంగాల్లో నిస్తేజం, జీడీపీ వృద్ధిరేటు క్షీణత, నిరుద్యోగం వంటి సమస్యలకు దారితీస్తున్నది. మరోవైపు ఎల్ నినో కారణంగా ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే జరిగితే పంటల సాగు, దిగుబడి ప్రభావితమై ఆహారోత్పత్తుల ధరలు ఆకాశాన్నంటే వీలున్నది. ఆర్బీఐ ఇప్పుడు ఈ అంశాలపైనే ఆందోళన చెందుతున్నది.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనంపై గవర్నర్ మాట్లాడుతూ.. బలమైన డాలర్ డిమాండ్, భౌగోళిక-రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లోనూ చాలా దేశాల కరెన్సీల కంటే రూపీ మెరుగైన ప్రదర్శనను కనబరుస్తున్నదని చెప్పుకొచ్చారు. ‘పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత డాలర్ బలపడుతున్నది. ఈ నేపథ్యంలోనే చాలా దేశాల కరెన్సీల విలువ బలహీనపడుతున్నది. అంతర్జాతీయ కోణంలో చూసినైట్టెతే భారతీయ కరెన్సీ రూపాయి పరిస్థితిని సాధారణంగానే భావించవచ్చు’ అన్నారు. కాగా, గత ఏడాది దేశీయ స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) దాదాపు 95 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, ఇదో రికార్డు అని మల్హోత్రా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) సుమారు 7 బిలియన్ డాలర్లు వచ్చినట్టు వెల్లడించారు.