Weddings | త్వరలో ప్రారంభమయ్యే పెండ్లిండ్ల సీజన్లో కేవలం దేశ రాజధాని ఢిల్లీలోనే రూ.1.5 లక్షల కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ పెండ్లిండ్ల సీజన్లో 4.5 లక్షల జంటలు ఒక్కటి కానున్నాయి. దీనివల్ల రిటైల్ బిజినెస్ లబ్ధి పొందుతుందని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కెయిట్) నిర్వహించిన సర్వేలో తేలింది. విదేశీ ఉత్పత్తుల కంటే దేశీయ ఉత్పత్తులను పెండ్లిండ్ల సీజన్లో వాడుతున్నారని కెయిట్ జాతీయ సెక్రటరీ జనరల్, పార్లమెంట్ సభ్యులు ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. ‘వోకల్ ఫర్ లోకల్’, ‘ఆత్మనిర్బర్ భారత్’ అన్న ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు కస్టమర్లు పూర్తిగా స్థానిక ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది కొత్తగా వివాహ వేడుకల కోసం సోషల్ మీడియా సర్వీసులపై ఖర్చు పెట్టే ధోరణి పెరుగుతున్నదన్నారు.
దేశవ్యాప్తంగా నవంబర్ 12 నుంచి పెండ్లిండ్ల సీజన్ ప్రారంభం కానున్నది. దేశమంతటా 48 లక్షల కొత్త జంటలు ఒక్కటి కానున్నాయి. దీనివల్ల రూ.5.9 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని కెయిట్ తెలిపింది. గతేడాది రూ.4.25 లక్షల కోట్లతో పోలిస్తే మరింత ఎక్కువ. ఢిల్లీలో బట్టలు, బంగారం ఆభరణాలు, బాంకిట్ హాళ్లు, హోటళ్లు, ఈవెంట్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ సేవల ధరలు పెరిగి అవకాశం ఉందని పేర్కొంది.