హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో మరో గ్లోబల్ క్యాపబిలిటీస్ సెంటర్ (జీసీసీ) ప్రారంభమైంది. ప్రముఖ ఔట్‌పేషెంట్ రిహాబిలిటేషన్ థెరపీ-ప్రాక్టీస్ మేనేజ్మెంట్ సేవల సంస్థ, అమెరికాకు చెందిన వెబ్‌పీటీ.. ఈ కొత్త జీసీసీని తీసుకొచ్చింది. ఇక్కడి రహేజా మైండ్‌స్పేస్ వద్ద దీన్ని ఏర్పాటు చేసింది. సోమవారం కంపెనీ సీఈవో ఆశ్లే గ్లోవర్‌తో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ ఈ జీసీసీని ప్రారంభించారు.
600 మంది ఉద్యోగులతో..
కొత్త సెంటర్లో 600 మంది ఉద్యోగులు పనిచేయనున్నారు. వీరంతా అత్యుత్తమ శ్రేణిలో రెవిన్యూ సైకిల్ మేనేజ్మెంట్ సర్వీసులు, కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడంపై దృష్టి పెట్టనున్నారు. కాగా, ఈ గ్లోబల్ క్యాపబిలిటీస్ సెంటర్ కార్యకలాపాలను సులభతరం చేయడానికి సమ్మిట్ కన్సల్టింగ్ సర్వీసెస్‌తో వెబ్‌పీటీ భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకున్నది. అమెరికా రాష్ట్రం అరిజోనాలోని ఫోనిక్స్ కేంద్రంగా 2008లో వెబ్‌పీటీ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత వేగవంతమైన ఔట్‌పేషెంట్ రిహాబ్ థెరపీ సాఫ్ట్వేర్ వేదికల్లో వెబ్‌పీటీ కూడా ఒకటి. మస్కులోస్కెలిటల్ సమస్యలతో బాధపడుతున్న వేలాది రోగుల సంరక్షణకు మెరుగైన సేవలను అందిస్తున్నది. కార్యక్రమంలో వెబ్‌పీటీ సీవోవో పాల్ షుగా, తెలంగాణ లైఫ్ లైస్సెన్స్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్, సమ్మిట్ కన్సల్టింగ్ సర్వీసెస్ వ్యవస్థాపక సీఈవో సందీప్ శర్మ పాల్గొన్నారు.
దావోస్ డబ్ల్యూఈఎఫ్‌లో..
జనవరిలో దావోస్‌లో జరిగిన డబ్ల్యూఈఎఫ్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పాల్గొన్నది తెలిసిందే. ఈ సందర్భంగానే హైదరాబాద్‌లో రూ.150 కోట్ల పెట్టుబడులతో ఈ జీసీసీని ఏర్పాటు చేస్తామని వెబ్‌పీటీ ప్రకటించింది.
‘ఈ వెబ్‌పీటీ సెంటర్ డబ్ల్యూఈఎఫ్ దావోస్‌లో ప్రకటించబడింది. 100 రోజుల్లోనే దీన్ని హైదరాబాద్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. ఈ విజయం వెనుక ఉన్నవారందరికీ నా అభినందనలు. సుస్థిర పాలన, ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలు, ప్రతిభ-నైపుణ్యాలు కలిగిన సిబ్బంది, మెరుగైన జీవనం వంటివి లైఫ్ సైన్సెస్, హెల్త్‌టెక్ కంపెనీలకు హైదరాబాద్‌ను జీసీసీ హబ్‌గా మారుస్తున్నాయి’
-కే తారక రామారావు,రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
‘మా సేవల విస్తరణకు, సభ్యుల వ్యాపారాభివృద్ధి కోసం మా ఈ హైదరాబాద్ ఆఫీస్‌లో ప్రధానంగా పెట్టుబడులు పెట్టాం. అలాగే ఈ రంగంలో ప్రతిభ-నైపుణ్యంగలవారికి ఇదో సదవకాశం. ఇక మస్కులోస్కెలిటల్ సమస్యలతో బాధపడుతున్న రోగుల చికిత్సకు మరింతమంది రిహాబ్ థెరపిస్టులు అందుబాటులో ఉంటారు’
-ఆశ్లే గ్లోవర్, వెబ్‌పీటీ సీఈవో