న్యూఢిల్లీ, జనవరి 11: కేంద్ర టెలికాం శాఖకు ఇవ్వాల్సిన స్పెక్ట్రం, ఏజీఆర్ బకాయిలపై వడ్డీ మొత్తాన్ని ఈక్విటీగా మార్చి, ఆ ఈక్విటీ వాటాను ప్రభుత్వానికి చెల్లించేందుకు వొడాఫోన్ఐడియా, టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర)లు సిద్దమయ్యాయి. ఈ బకాయిలపై వొడాఫోన్ఐడియా రూ. 16,000 కోట్లు వడ్డీని చెల్లించాల్సిఉండగా, ఇందుకు బదులుగా 35.8 శాతం ఈక్విటీ వాటాను ప్రభుత్వానికి ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. స్పెక్ట్రం వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై వడ్డీని ఈక్విటీగానా లేదా నగదుగా చెల్లించాలా అనే ఆప్షన్ను కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చింది. వొడాఐడియా ప్రభుత్వానికి రూ. 1,08,610 కోట్లు స్పెక్ట్రం వాయిదాల్ని, రూ.63,400 కోట్లు ఏజీఆర్ బకాయిల్ని చెల్లించాల్సి ఉంది. వీటికి తోడు బ్యాంక్లు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న మరో రూ. 22,770 కోట్ల రుణం కూడా ఉంది.
ప్రభుత్వానికి షేరు ఒక్కింటికీ రూ. 10 ముఖ విలువపై ప్రిఫరెన్స్ షేర్లను జారీచేయనున్నట్లు వొడాఫోన్ఐడియా తెలిపింది. ఈక్విటీ వాటాను ప్రభుత్వం తరపున యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా స్టాట్యూటరీ అండర్టేకింగ్ (ఎస్యూయూటీఐ) హోల్డ్ చేస్తుంది. దీంతో కంపెనీలో 35.8 శాతం మెజారిటీ వాటా ప్రభుత్వానికి వస్తుంది. తాజా ఈక్విటీ జారీ కారణంగా వొడాఫోన్ ఐడియా ప్రమోటింగ్ సంస్థల వాటా మైనారిటీలో పడుతుంది. వొడాఫోన్ గ్రూప్ వాటా 28.5 శాతానికి, ఆదిత్యాబిర్లా గ్రూప్ వాటా 17.8 శాతానికి తగ్గుతుంది.
టాటా టెలిసర్వీసెస్ బకాయిలపై రూ.850 కోట్ల వడ్డీ ఉంది. ఇందుకు బదులుగా షేరు ఒక్కింటికీ రూ.41.50 చొప్పున ప్రభుత్వానికి ఈక్విటీని జారీచేయాలన్న ప్రతిపాదనను మంగళవారం కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. ఈ షేర్ల జారీతో టాటా టెలిలో 9.5 శాతం ప్రభుత్వం సొంతమవుతుంది. 2021 సెప్టెంబర్నాటికి కంపెనీలో ప్రమోటర్లకు 74.36 శాతం, పబ్లిక్కు 25.64 శాతం చొప్పున వాటా ఉంది.