న్యూఢిల్లీ, మే 25: మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముకేశ్ అంబానీ మరో అడుగుముందుకేశారు. వయాకామ్ 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లను విలీనానికి సంబంధించి కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అనుమతి కోరారు. ఈ రెండు సంస్థలు విలీనమైన తర్వాత ఏర్పడే సంస్థ విలువ 8.5 బిలియన్ డాలర్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వయాకామ్ 18, ది వాల్ట్ డిస్నీ కంపెనీ(టీడబ్ల్యూడీసీ)కి చెందిన స్టార్ ఇండియాలను విలీనం చేయనుండటంతో జాయింట్ వెంచర్లో సరికొత్త సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ జాయింట్ వెంచర్‌తో ఏర్పాటుకానున్న సంస్థతో రిలయన్స్‌కు చెందిన ఇతర మీడియా వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టంచేసింది. టీవీ బ్రాడ్‌కాస్టింగ్‌తోపాటు ఓటీటీ ప్లాట్‌ఫాం సేవలను స్టార్ ఇండియా అందిస్తున్నది. అంతర్జాతీయ మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ, రిలయన్స్ ఇండస్ట్రీలు తమ మీడియా సంస్థలను విలీనం చేస్తున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రకటించాయి. దీనికి నియంత్రణ మండళ్లు అనుమతించాల్సి ఉంటుంది. ఈ విలీనం తర్వాత ఏర్పడే సంస్థ దేశీయ మీడియా-ఎంటర్టైన్మెంట్ రంగంలో అతిపెద్ద సంస్థగా అవతరించనున్నది. ఈ సంస్థ చైర్మన్‌గా నీతా అంబానీ, వైస్ చైర్మన్‌గా ఉదయ్ శంకర్ వ్యవహరించనున్నారు. ఈ జాయింట్ వెంచర్లో రిలయన్స్‌కు 63.16 శాతం వాటా ఉండనుంగా, డిస్నీకి 36.84 శాతం వాటా ఉండనున్నది.