GST | ఈ ఏడాది అక్టోబర్ నాటికి వస్తు సేవల పన్ను (GST)ని సరళీకృతం చేసి, పన్ను రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగంలో తెలిపారు. ఈ మార్పులు అమలైతే దీపావళి నాటికి ప్యాసింజర్ కార్లు, ద్విచక్ర వాహనాల ధర తగ్గే అవకాశాలున్నాయి. దేశీయ డిమాండ్‌ను పెంచడమే ప్రభుత్వ లక్ష్యం, ఇది సాధారణ ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రస్తుతం, ప్రభుత్వం చాలా వస్తువులపై 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం చొప్పున పన్ను విధిస్తోంది. కొత్త సంస్కరణల ప్రకారం.. సరళీకృతం చేయడానికి, రెండు శ్లాబులుగా విభజించేందుకు సిద్ధమవుతున్నది. 5 శాతం (మెరిట్), 18 శాతం శ్లాబ్‌లను తీసుకురానున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం కార్లు, ద్విచక్ర వాహనాలపై 28 శాతం పన్ను విధిస్తున్నారు. 18 శాతానికి తగ్గించే అవకాశం ఉంది.
దాంతో వాహనాలను కొనుగోలు చేసే సమయంలో దాదాపు 5శాతం నుంచి పదిశాతం వరకు ఆదా చేసే అవకాశం ఉంటుంది. కొత్త జీఎస్టీ రేటు అమలులోకి వస్తే రూ.10లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఎంట్రీ లెవల్ ద్విచక్ర వాహనాలు, చిన్న కార్ల వినియోగదారులకు పెద్ద ప్రయోజనం చేకూరుతుంది. వాహనాల ధరలు తగ్గడమే కాకుండా ఆటోమొబైల్ విడిభాగాల ధరలు దిగిరానున్నాయి. తయారీ ఖర్చును ప్రభావితం చేస్తుంది. వాహనాల ఉత్పత్తి సైతం దిగి వస్తుంది. అలాగే, విడిభాగాల ధర తగ్గింపు కారణంగా వాహనాలరుదాపై భారం తగ్గుతుంది. ముఖ్యంగా ద్విచక్ర వాహన కంపెనీలు చాలా కాలంగా ఈ పన్ను తగ్గింపును డిమాండ్ చేస్తున్నాయి. సమాచారం ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాల (EV’s)పై పన్ను స్లాబ్ మునుపటిలాగే 5 శాతంగా ఉంటుంది.
అదే సమయంలో లగ్జరీ కార్లపై ఉన్న పన్ను యథావిధిగా కొనసాగించే అవకాశాలున్నాయి. దాంతో పాటు ప్రభుత్వం పరిహార సెస్‌ను ప్రయాణికుల వాహనాలపై సైతం వర్తిస్తుంది. మరోవైపు, పొగాకు వంటి ఉత్పత్తులపై 40 శాతం పన్ను విధించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. పన్ను తగ్గింపు కారణంగా, ఆటోమొబైల్స్ మాత్రమే కాకుండా, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా తగ్గనున్నాయి. ఇది దేశీయ వినియోగం, వాణిజ్యం రెండింటినీ పెంచుతుంది. తద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. మంత్రుల బృందం (GoM) సిఫార్సులను GST కౌన్సిల్ త్వరలో చర్చిస్తుందని, త్వరలో అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ప్రజలు దాని ప్రయోజనాలను పొందడమే లక్ష్యం’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. దీపావళి నాటికి అంటే అక్టోబర్-నవంబర్‌లో కొత్త పన్ను రూల్స్ అమలులోకి వస్తాయని భావిస్తున్నారు.