Vehicle Insurance | కరోనా తర్వాత పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది. అందునా మంచి మైలేజీ ఇచ్చే వెహికల్స్ కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కొత్త బైక్.. లేదా కారు కొనుగోలు చేస్తున్నారంటే కలిగే ఆనందం చెప్పలేనిది. అయితే, కారైనా.. బైక్ అయినా రోడ్డు మీదకు రావడానికి ముందు తప్పనిసరి కొన్ని నిబంధనలు పాటించాల్సిందే. ఇందులో ముఖ్యమైంది వెహికల్ ఇన్సూరెన్స్.
మోటార్ బైక్ లేదా స్కూటర్‌కైతే ఐదేండ్లు, కార్లకైతే మూడేండ్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. అయితే, వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే సమయంలో పలువురు పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలా పొరపాట్లకు తావివ్వకుండా.. జాగ్రత్తలు తీసుకుంటే సరైన వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి వీలు చిక్కుతుంది.
గతంలో లైసెన్స్ లేకపోయినా.. హెల్మెట్ లేకపోయినా జరిమానాలు విధించే వారు.. ఇప్పుడు వాహనానికి బీమా లేకుండా నడిపితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జరగరాని నష్టం ఏం జరిగినా సదరు యజమానే నష్ట పరిహారం పే చేయాల్సి ఉంటుంది. కనుక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోని వాహనాన్ని రోడ్లపై నడుపకూడదు.
ప్రత్యేకించి కొత్త కార్ల కొనుగోలుదారులు ఏడాది పూర్తి స్థాయి, మూడేండ్ల థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. వెహికిల్‌కు ఏ నష్టం వచ్చినా సదరు ఇన్సూరెన్స్ సంస్థే పూర్తి మరమ్మతు ఖర్చు పే చేస్తుంది. మూడో పక్షానికి నష్టం జరిగినా.. ఆ బీమా సంస్థే పరిహారం చెల్లిస్తుంది.
కార్లు, టూ వీలర్స్ డీలర్లు తమతో ఒప్పందం ఉన్న ఇన్సూరెన్స్ సంస్థల నుంచే వాహనాల కొనుగోలుదారులకు ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వడానికి మొగ్గు చూపుతుంటారు. కానీ వెహికల్స్ కొనేవారు.. డీలర్లు సూచించిన సంస్థ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే కొనుగోలు చేయాలని కూడా ఏం లేదు. ఆన్లైన్లో మీ వెహికల్‌కు సరిపడా ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఎంక్వైరీ చేయండి. అందులో మీకు నచ్చిన సంస్థ నుంచి పాలసీ నేరుగా తీసేసుకోవచ్చు.
టూ వీలర్స్ కొనుగోలుదారులు కేవలం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. పూర్తిస్థాయి బీమా పాలసీ తీసుకోవడానికి మొగ్గు చూపరు. ఇలా చేయడం పొరపాటవుతుంది. ఏదైనా ప్రమాదం జరిగినా, దొంగతనం జరిగినా పూర్తిస్థాయిలో ఇన్సూరెన్స్ సంస్థ పరిహారం చెల్లిస్తుంది.
కనుక పూర్తిస్థాయి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకుంటే సదరు వాహన యజమాని నష్టపోయినట్లేనని నిపుణులు చెబుతున్నారు. పలువురు పూర్తి స్థాయి ఇన్సూరెన్స్ పాలసీ టైం అయిపోయిన తర్వాత దాని రెన్యూవల్ గురించి పట్టించుకోకుండా.. థర్డ్ పార్టీ పాలసీపైనే ఆధార పడతారు. ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు.. ఇప్పుడంతా కాసులమయం. కారుకు చిన్న డ్యామేజీ అయినా రిపేరు కోసం వేల రూపాయలలో ఖర్చు వస్తుంది. బీమా పాలసీ ఉంటే వాహనదారులకు సొంతంగా ఖర్చు చేయాల్సిన అవసరం రాదన్న విషయం పరిగణనలోకి తీసుకోవాలి.
వెహికల్ ఇన్సూరెన్స్ వేళ.. సదరు వాహనానికి విలువ కూడా ముఖ్యమే. పలు సందర్భాల్లో బీమా ప్రీమియం తగ్గించుకోవడానికి ఇన్సూర్డ్ డిక్లేర్ విలువ తగ్గించి చూపుతారు. వాహనానికి డ్యామేజీ జరిగినప్పుడు గరిష్ట పరిహారం చెల్లింపు విలువ ఇది. దీన్ని తగ్గించడం వల్ల ప్రీమియం పేమెంట్ భారం తగ్గుతుందేమో గానీ.. నష్టం మాత్రం పూర్తిగా భర్తీ కాదు. కాబట్టి ఇన్సూర్డ్ డిక్లేర్ వాల్యూ ఎక్కువ ఉండేలా చూసుకోవడం బెటర్.
కొత్త కారు కొన్న వారు.. అనుబంధ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అడిషనల్ సేఫ్టీ లభిస్తుంది. కార్ల డీలర్లు కొనుగోలుదారులకు అనవసరంగా కొన్ని అనుబంధ బీమా పాలసీలు అంట గడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఇంజిన్ ప్రొటెక్టర్, రిటర్న్ టూ ఇన్వాయిస్ కవర్, జీరో డిప్రిషియేషన్ వంటి పాలసీలు పరిశీలించి.. అవసరం అనుకున్న వాటిని తీసుకోవచ్చు.
ఇక ఇన్సూరెన్స్ సంస్థ అందించే సేవలను పరిగణనలోకి తీసుకున్నాకే తక్కువ ప్రీమియం పాలసీలు తీసుకోవాలి. వెహికల్ ఎక్స్చేంజ్ సమయంలో గానీ.. ఉన్న వెహికల్ విక్రయించి.. కొత్త వాహనం కొన్నా నో క్లయిమ్ బోనస్ వంటివి వర్తిస్తాయి. ఇటువంటి సందర్భాల్లో ఇన్సూరెన్స్ ప్రీమియంలో రాయితీ పొందే చాన్స్ ఉంటుంది.