ముంబై, ఫిబ్రవరి 18: బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.400 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు తరలించుకుపోతుండటం, కార్పొరేట్ల నిరుత్సాహక ఫలితాలతో మదుపరుల్లో సెంటిమెంట్ నీరుగారింది. దీంతో అమ్మకాలకు మొగ్గుచూపడంతో మంగళవారం రూ.2,01,032.5 కోట్లు కరిగిపోయి రూ.3,89,31,067.30 కోట్ల(4.58 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది. గతేడాది ఏప్రిల్‌లో తొలిసారిగా రూ.400 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించిన బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ 10 నెలల్లో ఈ మైలురాయిని కోల్పోవడం విశేషం. గతేడాది సెప్టెంబర్ 27న
చారిత్రక గరిష్ఠ స్థాయి 85,978.25 పాయింట్లను తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ ప్రస్తుతం 10,010.86 పాయింట్లు లేదా 11.64 శాతం వాటాను కోల్పోయింది.
సూచీలదీ అదేదారి స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఎఫ్ఐఐల పెట్టుబడులు ఉపసంహరణ, కార్పొరేట్ల నిరుత్సాహక ఫలితాలతో మంగళవారం సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 29.47 పాయింట్లు నష్టపోయి 75,967.39 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ కూడా 14.20 పాయింట్లు కోల్పోయి 22,945.30 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రాఅండ్ మహీంద్రా, హెచ్‌యూఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, ఐటీసీ, టాటా మోటర్స్, సన్‌ఫార్మా షేర్లు నష్టపోగా..ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, జొమాటో, పవర్‌గ్రిడ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే ఇండస్ట్రియల్స్ 1.51 శాతం నష్టపోగా, కన్జ్యూమర్ డ్యూరబుల్ 1.19 శాతం, టెలికం 1.06 శాతం, క్యాపిటల్ గూడ్స్, వాహన రంగ షేర్లు నష్టపోయాయి. కానీ, యుటిలిటీ, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఎనర్జీ సూచీలకు మదుపరుల నుంచి మద్దతు లభించింది.