హైదరాబాద్, ఏప్రిల్ 26: లాజిస్టిక్స్ సేవల సంస్థల్లో ఒకటైన వీ-ట్రాన్స్ (ఇండియా) తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ, ఏపీలలో 50 శాఖలను నిర్వహిస్తున్న సంస్థ.. త్వరలో మరో 10 బ్రాంచ్‌లను ప్రారంభించబోతున్నది. ఈ విషయాన్ని కంపెనీ చైర్మన్, గ్రూపు ఎండీ మహేంద్ర షా తెలిపారు. తెలంగాణలో ఏడు టెక్స్టైల్స్ పార్క్‌లు, ఫార్మా సిటీ ఉండటంతో రవాణా సదుపాయాలకు డిమాండ్ ఉంటుందన్న అంచనాతో ఇక్కడి వ్యాపారంపై దృష్టి సారించినట్టు ఈ సందర్భంగా చెప్పారు.
ఈ శాఖలతోపాటు వాటి పక్కనే చిన్న స్థాయి గిడ్డంగులను సైతం ఏర్పాటు చేసినట్టు, తద్వారా వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. మరోవైపు, హైదరాబాద్‌కు సమీపంలోని బహదూర్‌పల్లిలో ఉన్న గిడ్డంగి కెపాసిటీని రెండింతలు పెంచి 38 వేల చదరపు అడుగులకు విస్తరించినట్టు చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీ టర్నోవర్ రూ.3,000 కోట్లకు చేరుకుంటుందని ఆయన ఆశిస్తున్నారు.