న్యూఢిల్లీ, ఆగస్టు 18 : అమెరికాలోకి వచ్చే భారతీయ వస్తూత్పత్తులపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు.. లక్షల్లో ఉద్యోగాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. టారిఫ్‌లు ఇలాగే కొనసాగితే దేశీయ ఎగుమతులపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారిప్పుడు. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌పైనే ప్రధానంగా ఆధారపడిన భారత వస్త్ర, రత్నాలు-ఆభరణాల రంగాల్లో 3 లక్షలదాకా ఉద్యోగాలు రిస్క్‌లో పడవచ్చని అంచనా వేస్తుండటం గమనార్హం.
దేశంలో పెద్ద ఎత్తున ఉండే డిమాండ్, అమెరికాయేతర దేశాలకు భారీగా జరుగుతున్న ఎగుమతుల వల్ల సుంకాల ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండబోదని కొందరు చెప్తున్నా.. మెజారిటీ విశ్లేషకులు మాత్రం కీలక రంగాలు కుదేలేనన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వాహన విడిభాగాల తయారీ సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లు ఒడిదొడుకులకు గురి కావచ్చంటున్నారు. ఔషధ రంగం వంటి ఒకట్రెండు ఇండస్ట్రీలపై టారిఫ్‌ల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చంటూనే.. చివరకు ఐటీ సేవలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కూడా ప్రభావితం కావచ్చని చెప్తుండటం ఆందోళనల్ని రేకెత్తిస్తున్నది.
భారతీయ వస్త్ర, రత్నాలు-ఆభరణాల ఎగుమతుల్లో మెజారిటీ వాటా అమెరికాదే. అందుకే ఆ దేశం టారిఫ్‌లు ఇప్పుడు ఈ రంగాల్లో ప్రకంపనల్ని పుట్టిస్తున్నాయి. పెరిగే సుంకాల భారం.. అమెరికాలో భారతీయ వస్త్ర, రత్నాలు-ఆభరణాల వస్తూత్పత్తుల ధరల్ని పెంచగలవు. ఇదే జరిగితే మార్కెట్లో అమ్మకాలు పడిపోతాయి. ప్రత్యామ్నాయంగా అమెరికన్లు ఇతర దేశాల నుంచి వస్తున్న వస్త్ర, రత్నాలు-ఆభరణాల వైపు చూసే వీలున్నది. దీంతో క్షీణించే ఎగుమతులు.. ఉత్పత్తి తగ్గుదలకు దారితీస్తే అంతిమంగా వ్యయ నియంత్రణ, ఉద్యోగుల తొలగింపులు, నష్టాల్లో ఉన్న సంస్థల మూసివేతలే ఉంటాయని ఆయా రంగాల నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే సుంకాలు ఇలాగే కొనసాగితే దేశీయ వస్త్ర, రత్నాలు-ఆభరణాల రంగాల్లో 2 నుంచి 3 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డట్టేనని అంచనా వేస్తున్నారు. ఇక ఉన్న ఉద్యోగాలనే తీసేసే కంపెనీలు.. కొత్తగా నియామకాలకు ఎందుకు వెళ్తాయని కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఉద్యోగావకాశాలూ సన్నగిల్లుతాయని పలువురు పేర్కొంటున్నారు. తాత్కాలిక, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో లాజిస్టిక్ వర్కర్లు, షాప్-ఫ్లోర్ వర్కర్లు, సేల్స్ సిబ్బందికి ఇబ్బందులేనన్న అంచనాలున్నాయి.
టెక్స్టైల్స్, ఆటో కంపోనెంట్స్, వ్యవసాయ, రత్నాలు-ఆభరణాల రంగాలు అమెరికా సుంకాలతో తీవ్రంగా ప్రభావితమయ్యే వీలున్నది. టారిఫ్‌లు 6 నెలలు ఇలాగే ఉంటే అత్యధికంగా జీవనోపాధినిస్తున్న వస్త్ర పరిశ్రమల్లో లక్ష ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉన్నది. సూరత్, ముంబై సీప్జ్ వంటి రత్నాల హబ్ల్లోనూ పెద్ద ఎత్తున ఉద్యోగులు రిస్క్‌ను ఎదుర్కొంటారు.
ఎలక్ట్రానిక్స్, రత్నాలు-ఆభరణాలు, టెక్స్టైల్స్, వాహన విడిభాగాలు, తోలు, పాదరక్షలు, రొయ్యలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు అమెరికా టారిఫ్‌లతో ప్రభావితం అవుతాయి. ఇప్పటికే ఆయా రంగాల్లోని కంపెనీలు వ్యయ నియంత్రణ చేయడం, కొత్త నియామకాల ప్రక్రియను ఆపేస్తున్నాయి.