Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై మిస్సైళ్లతో విరుచుకుపడింది. అమెరికా దాడుల ప్రభావం మార్కెట్‌పై పడింది. మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఫలితంగా మార్కెట్లు పతనమయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,704.07 పాయింట్ల వద్ద సెన్సెక్స్ నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 82,169.67 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యల్పంగా 81,476.76 పాయింట్లకు పడిపోయింది. చివరకు 511.38 పాయింట్ల నష్టంతో 81,896.79 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 140.50 పాయింట్లు తగ్గి 24,971.90 వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్‌లో దాదాపు 1,794 షేర్లు లాభపడగా.. మరో 2,113 షేర్లు పతనమయ్యాయి. ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్ నిఫ్టీలో ప్రధానంగా లాభాలను ఆర్జించాయి. ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ, హీరో మోటోకార్ప్, ఎం అండ్ ఎం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో, బ్యాంక్, టెలికాం 0.3 నుంచి 1.5 శాతం పతనమయ్యాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్, మీడియా, మెటల్, క్యాపిటల్ గూడ్స్ 0.3-4 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగాయి.