న్యూఢిల్లీ, మార్చి 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న రక్షణాత్మక చర్యలు ఇతర దేశాల పాలిట శాపంగా మారుతున్నాయి. పలు దేశాలపై ప్రతికూల సుంకాలు విధింపుతథ్యమని హెచ్చరికలు జారీ చేయడంతో ఆయా దేశాలు బెంబేలెత్తుతున్నాయి. ఈ సుంకాల పెంపుతో దేశీయ పెట్రోకెమికల్స్, ఫార్మా ఎగుమతులపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నాయి. ఈ దెబ్బకు కరెన్సీ తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనుకావచ్చునని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. టారిఫ్ సెగతో అనూహ్యంగా అమెరికా కరెన్సీ డాలర్ విలువ బలపడుతుండటంతో దీంతో రూపాయి విలువ మరింత దిగజారుతున్నది.
గడిచిన నెల రోజుల్లో డాలర్ విలువ 10 శాతం వరకు బలపడటంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురికావాల్సి వస్తున్నదని, ఇది ఏ మాత్రం మంచిదికాదని, ముఖ్యంగా రూపాయి విలువ మరింత దిగజారుతున్నదని వెల్లడించారు. కరెన్సీ పతనమవుతుండటంతో దిగుమతి చేసుకునే వస్తువులకు అధికంగా చెల్లింపులు జరుపాల్సి వస్తుండటంతో దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద దెబ్బలాంటిదని అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా దేశీయ వినిమయంలో 80 శాతం ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్న భారత్‌కు ఇది ఎదురుదెబ్బ. డాలర్ బలపడిన లేదా పతనం చెందిన ఇతర దేశాల కరెన్సీలకు ముచ్చెమటలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మెక్సికో, కెనడా ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్, చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాన్ని విధించబోతున్నట్లు ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు.
అమెరికా దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై విధిస్తున్న టారిఫ్ కంటే భారత్ దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై విధిస్తున్న టారిఫ్ అధికంగా ఉండటంతో ఇటీవల ట్రంప్ హెచ్చరికలు జారీచేశారు. ఒకవేళ సుంకాలను తగ్గించకపోతే మీమీద ప్రతికార సుంకాలను విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన భారత్..అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై విధిస్తున్న పన్నును తగ్గించేయోచనలో ఉన్నది.
ట్రంప్ దెబ్బతో అతి విలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి తెరలేపడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఇదే క్రమంలో బంగారం, వెండి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం వెండి రూ.93 వేల నుంచి రూ.97 వేల స్థాయిలో కదలాడుతున్నది.
త్వరలో కిలో వెండి ఏకంగా రూ.1.15 లక్షలకు చేరుకునే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నారు. అలాగే రూ.87 వేల స్థాయిలో కదలాడుతున్న బంగారం సమీప భవిష్యత్తులో రూ.90 వేలను తాకే అవకాశాలున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 2,900 డాలర్ల నుంచి 2,940 డాలర్ల స్థాయిలో కదులుతున్నది. ఒకవేళ 3 వేల డాలర్లను దాటితే దేశీయంగా రూ.90 వేల నుంచి లక్షకు చేరుకునే ఆస్కారం ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. సుంకాల విధింపు నిర్ణయంతో ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధరలు 10 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో బిట్‌కాయిన్ ధర 3 శాతం పడిపోయింది.