హైదరాబాద్, జూలై 8: అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ సీ1..హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ కేపబిలిటీ సెంటర్(జీఐసీసీ)ని మరింత విస్తరించింది. గతేడాది 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కార్యాలయానికి అదనంగా మరో 20 వేల చదరపు అడుగుల కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించింది.
సత్వ నాలెడ్జ్ పార్క్లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో 600 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, ఈ సంఖ్యను మరింత పెంచుకునే అవకాశం ఉన్నదని కంపెనీ ఎండీ, కంట్రీ హెడ్ చంద్ర బొడ్డొజు తెలిపారు. అంతర్జాతీయంగా ఫార్చ్యూన్ 500 సంస్థల్లో సగం తమ క్లయింట్లను, వీటికి ఇక్కడి నుంచే సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
అలాగే పరిశోధన-అభివృద్ధి(ఆర్అండ్డీ)ని కూడా ఏర్పాటు చేసినట్లు, దీంట్లో ప్రస్తుతం 60 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది చివరినాటికి మొత్తం సిబ్బంది సంఖ్యను వెయ్యికి పెంచుకునే అవకాశాలున్నాయన్నారు.