UPI Payments | భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వేగం పుంజుకుంటున్నది. రోజురోజుకో కొత్త రికార్డు నెలకొల్పుతున్నది. అక్టోబర్ నెలలో యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఫెస్టివ్ సీజన్ కొనుగోళ్ల నేపథ్యంలో అక్టోబర్‌లో 730 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. యూపీఐ ప్లాట్పామ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే ఆల్‌టైం రికార్డు. 730 కోట్ల లావాదేవీల్లో రూ.12.11 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. లావాదేవీల విలువలోనూ రికార్డు నమోదైందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది.
గతేడాదితో పోలిస్తే గత నెలలో లావాదేవీలు 73 శాతం పెరిగితే, ట్రాన్సాక్షన్స్ విలువ 57 శాతం పెరిగింది. గత రెండేండ్లలో యూపీఐ లావాదేవీలు అనునిత్యం పుంజుకుంటున్నాయని ఎన్పీసీఐ వెల్లడించింది. కరోనా మహమ్మారి ఆంక్షల వేళ చెల్లింపుల్లో మందగమనం తోడైనా తర్వాత ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతున్న నేపథ్యంలో వినియోగదారుల రోజువారీ లావాదేవీలకు కూడా డిజిటల్ చెల్లింపుల విధానం పుంజుకుంటున్నది.
2016లో యూపీఐ ప్లాట్‌ఫామ్ సేవలు యూజర్లకు అందుబాటులోకి వస్తే, 2019 అక్టోబర్‌లో తొలిసారి వంద కోట్ల లావాదేవీల మార్క్‌ను దాటాయి డిజిటల్ పేమెంట్స్. అటుపై గతేడాది అక్టోబర్‌కు 200 కోట్లు, అటుపై పది నెలలకు 300 కోట్ల లావాదేవీల మార్క్‌ను అధిగమించాయి. తదుపరి నాలుగు నెలలకు ప్రతి నెలా 400 కోట్ల ట్రాన్సాక్షన్ రికార్డు నమోదైంది. ఈ ఏడాది మే నాటికి డిజిటల్ పేమెంట్స్ రూ.10 లక్షల కోట్ల మార్క్ దాటింది. 2021లోనే 22.28 బిలియన్ల లావాదేవీలు నమోదైతే రూ. 41.03 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి.