న్యూఢిల్లీ, జనవరి 1: కేంద్ర బడ్జెట్ అనగానే.. సామాన్య, మధ్యతరగతి ప్రజలు గంపెడాశలు పెట్టుకుంటారు. ఇక వేతన జీవుల సంగతి సరేసరి. ముఖ్యంగా సగటు ఉద్యోగి చూపంతా ఆదాయ పన్ను (ఐటీ)పైనే. స్లాబులు, డిడక్షన్లు.. ఇలా ఏ రూపంలోనైనా ఊరట దక్కుతుందా? అని వేయి కండ్లతో ఎదురు చూస్తుంటారు. అయితే కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు గద్దెనెక్కిన దగ్గర్నుంచి ఐటీ మినహాయింపులపై ఈ ఎదురుచూపులకు దాదాపుగా తెరపడిందనే చెప్పాలి. పాత, కొత్త ఆదాయ పన్ను విధానాలను పరిచయం చేశారుమరి.
పాత పన్ను విధానానికి పూర్తిగా స్వస్తి పలుకాలని చూస్తున్న కేంద్రం.. ప్రతి బడ్జెట్లో కొత్త పన్ను విధానంలోనే మార్పులు చేస్తూ వస్తున్నది. నిజానికి పాత దానితో పోల్చితే కొత్త విధానంలో పన్ను మినహాయింపులు పరిమితంగానే ఉన్నాయి. అయినప్పటికీ ట్యాక్స్‌పేయర్లను ఆకట్టుకొనేందుకు ఏటా కేంద్రం అనేకానేక ప్రయత్నాలు చేస్తున్నది. కానీ పాత పన్ను విధానం జోలికి మాత్రం అస్సలు వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో మరో వార్షిక బడ్జెట్ సిద్ధమవుతున్నది. దీంతో ఈసారైనా పాత పన్ను విధానంలో కీలకమైన సెక్షన్ 80సీ, డీ, సీసీడీ(1బీ) వంటి వాటి ప్రయోజనాలను పెంచాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు.
సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు 2014 నుంచి రూ.1.5 లక్షలుగానే ఉన్నాయి. పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ట్యూషన్ ఫీజులు, గృహ రుణాలపై చెల్లించే వడ్డీ, బీమా ప్రీమియంలు వంటివన్నీ దీని పరిధిలోకే వస్తాయి. అయినప్పటికీ గత 11 ఏండ్లుగా దీని పరిమితిని కేంద్రం పెంచలేదు. దీంతో దీన్ని ఈసారి రూ.3 లక్షలకు పెంచాలన్న డిమాండ్లున్నాయి. ఈ నిర్ణయం పొదుపు, పెట్టుబడులకు ఊతమిస్తుందన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపులను కోరవచ్చు. వ్యక్తిగతంగా, భాగస్వామి, పిల్లల కోసం రూ.25,000 మినహాయింపు అందుతుంది. సీనియర్ సిటిజన్లకైతే రూ.50,000. ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్స్కు అదనంగా మరో రూ.5,000 ఉంటుంది. అయితే సమగ్ర రీతిలో ఆరోగ్య బీమాను తీసుకున్నవారికి ప్రీమియంలు ఎక్కువగా ఉంటున్నందున సెక్షన్ 80డీకి ఉన్న ఐటీ మినహాయింపులను పెంచాలని అంతా కోరుతున్నారు. ఇక సెక్షన్ 24(బీ) కింద ట్యాక్స్‌పేయర్ కొనుక్కున్న ఇంటి కోసం తీసుకున్న రుణంపై పన్ను మినహాయింపు ఏటా రూ.2 లక్షలుగానే ఉన్నది. దీన్ని కూడా పెంచాలన్న డిమాండ్లున్నాయి.
సెక్షన్ 80సీసీడీ(1బీ).. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) విరాళాల కోసం పరిచయమైంది. రిటైర్మెంట్ సేవింగ్స్ గరిష్ఠ పరిమితి రూ.50,000 వరకున్నది. దీంతో దీన్ని లక్ష రూపాయలదాకా పెంచాలన్న డిమాండ్లున్నాయి. దీనివల్ల ఉద్యోగ పదవీ విరమణ పొందినవారికి లబ్ధి చేకూరుతుందని అంటున్నారు.
పాత పన్ను విధానం ఉండాల్సిందేనన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అనేక రకాల పన్ను మినహాయింపులతో కూడిన ఈ విధానం వల్ల ప్రజల్లో పొదుపు, పెట్టుబడులపై అవగాహన, ఆసక్తి పెరుగుతాయని మెజారిటీ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్తోనే దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉంటాయని వారు గుర్తుచేస్తున్నారు. కాబట్టి ఇకనైనా పాత పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంపై మోదీ సర్కారు దృష్టి పెట్టాలని వారంతా హితవు పలుకుతున్నారు.
