Kumaraswamy | హైదరాబాద్,జూలై 11 (నమస్తే తెలంగాణ): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ఈ ప్లాంట్‌పై అనేక మంది ఆధారపడి ఉన్నారని చెప్పారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌రావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజులతో కలిసి గురువారం వైజాగ్‌లోని స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రమంత్రి పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ తమ బాధ్యతని, ప్లాంట్‌లోని అన్ని విభాగాలను పరిశీలించామని, ప్రధాని ఆశీస్సులతో ప్లాంట్ వందశాతం సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. తనకు 2 నెలలు సమయమివ్వాలని, ప్రధాన మంత్రికి పూర్తిస్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత ఆయన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. కార్మికులకు ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అంతకుముందు ప్లాంట్‌లో కార్మిక సంఘా లు, ఉద్యోగ సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు.