న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: సెబీ చైర్పర్సన్ మాధబి పురి బచ్ దంపతుల వ్యవహారంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి స్పందించారు. మాధబి పురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్ తమను తాము రక్షించుకొంటూనే, తమపై వచ్చిన ఆరోపణలకు ధీటుగా స్పందిస్తున్నారన్నారు. సోమవారం న్యూస్18 ఇండియా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘చాలా ఆరోపణలకు సమాధానాలు వస్తున్నాయ్.
ఈ నిజాలను పరిగణనలోకి తీసుకుంటారనే అనుకుంటున్నాను’ అని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌నుద్దేశించి పరోక్షంగా మంత్రి వ్యాఖ్యానించారు. దీంతో ఈ అంశంలో మాధబి పురి బచ్ సమాధానాలపట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా? అన్న ప్రశ్నకు ‘నేనిక్కడ ఉన్నది దాన్ని నిర్ధారించేందుకు కాదు’ అని నిర్మలా సీతారామన్ బదులిచ్చారు. బచ్ దంపతులు అక్రమాలకు పాల్పడ్డారని, లాభాపేక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు వస్తున్న సంగతి విదితమే. అదానీ వ్యవహారంలో బచ్ అవినీతికి దిగారని హిండెన్‌బర్గ్ ఆరోపించినదీ తెలిసిందే.
రేపట్నుంచి ఎన్పీఎస్ వాత్సల్య
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) వాత్సల్య పథకాన్ని బుధవారం నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను జూలైలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఎన్పీఎస్ వాత్సల్య స్కీంను ప్రకటించిన విషయం తెలిసిందే.