Budget 2025 | న్యూఢిల్లీ, జనవరి 23: రాబోయే వార్షిక బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ)ను ప్రభావవంతంగా తగ్గించాలని, అప్పుడే మార్కెట్లో వినిమయం, డిమాండ్ పెరుగుతాయని గురువారం బార్క్లేస్ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త ఆస్తా గుడ్వానీ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే వృద్ధికి ఊతమిచ్చే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుడ్వానీ పేర్కొన్నారు. మార్కెట్లో డిమాండ్ అండ్ సైప్లె పెరిగితే.. ప్రైవేట్ రంగంలోకి పెట్టుబడులూ పెద్ద ఎత్తున తరలివస్తాయని గుర్తుచేశారు.
ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా.. వ్యక్తిగత ఆదాయానికి ఊతమిచ్చినట్టేనని, కొనుగోలు శక్తిని పెంచినట్టే అవుతుందని ఈ సందర్భంగా బార్క్లేస్ అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణం కట్టడికీ దోహదపడుతుందన్నారు. కాగా, కొత్త పన్ను విధానాన్ని మరింత మంది పన్ను చెల్లింపుదారులు ఎంచుకునేలా ఈసారి బడ్జెట్లో ఆకర్షణీయ మార్పులు చేసే అవకాశాలున్నాయని బార్క్లేస్ అంచనా వేస్తున్నది. ఇక గత ఏడాది తెచ్చిన చివరి బడ్జెట్లో ఉద్యోగ ట్యాక్స్‌పేయర్స్‌కు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75,000లకు పెంచిన విషయం తెలిసిందే. అలాగే పెన్షనర్ల కోసం కుటుంబ పెన్షన్‌పై కొత్త పన్ను విధానం కింద మినహాయింపును రూ.25,000లకు పెంచారు.
వచ్చే బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితుల్ని పెంచాలని, ఉద్యోగ కల్పనను ప్రోత్సహించే నిర్ణయాలు తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. సులభతర వ్యాపార నిర్వహణకు అనువైన ప్రోత్సాహకాలుండాలని, అప్పుడే దేశ జీడీపీకి బలం చేకూరగలదని ఆయా రంగాలు విశ్వసిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి పచ్చజెండా ఊపవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది 74 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక 2014 నుంచి యథాతథంగానే ఉంటున్న గృహ రుణ వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచాలన్న డిమాండ్లు నిర్మాణ రంగం నుంచి వస్తున్నాయి. పెరిగిన భూమి ధరలు, నిర్మాణ వ్యయం దృష్ట్యా ఇది తప్పనిసరి అన్న వాదనలు వారి నుంచి వస్తున్నాయి.
ఈసారి బడ్జెట్లో రాజకీయంగా కష్టతరమైన నిర్మాణాత్మక సంస్కరణల్ని సైతం అమలుపర్చే దిశగా మోదీ సర్కారు వెళ్లాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. అప్పుడే దిగాలుపడిన దేశ ఆర్థిక వృద్ధిరేటును తిరిగి ఉత్సాహపర్చవచ్చని, ఉద్యోగావకాశాల్నీ పెంచవచ్చన్నారు. ‘కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కారుకు ఇది తొలి పూర్తిస్థాయి బడ్జెట్. తమ అపారమైన రాజకీయ చతురతను ఉపయోగించి నిర్మాణాత్మక సంస్కరణలు తెచ్చేందుకు కృషి చేయాలి’ అన్నారు. వ్యక్తుల చేతికి మరింత నగదు అందితే వినీమయం పెరుగుతుందని.. ఇది ఉత్పత్తి, ఉద్యోగ కల్పన, వృద్ధిరేటుకు దోహదం చేయగలదన్నారు. కాబట్టి ఆ దిశగా నిర్ణయాలపై దృష్టి పెట్టాలని సూచించారు.