హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ ‘యూనిలివర్’ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కామారెడ్డిలో పామాయిల్ తయారీ, రిఫైనింగ్ యూనిట్‌తోపాటు బాటిల్ క్యాప్‌ల (సీసా మూతల) తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ వాణిజ్య వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి పేరొందిన ‘యూనిలివర్’ మన దేశంలో హిందుస్థాన్ యూనిలివర్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ‘యూనిలివర్’ గ్లోబల్ సీఈవో హీన్ షూమేకర్తోపాటు ఆ కంపెనీ చీఫ్ సైప్లెచైన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్తో సీఎం రేవంత్‌రెడ్డి జరిపిన చర్చల అనంతరం ఈ ఒప్పందం ఖరారైనట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొంటున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం మంగళవారం తెలంగాణ పెవిలియన్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమమైంది. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు ‘స్కైరూట్’ కంపెనీ ముందుకొచ్చింది. రూ.500 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్‌ను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. సప్లయ్ చైన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ రంగాల్లో ఖ్యాతి పొందిన ‘ఎజిలిటీ లాజిస్టిక్స్’ కంపెనీ వైఎస్ చైర్మన్ తారెక్ సుల్తాన్‌తో రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు.