Recession : ఈ ఏడాది చివరిలో ఎన్నికలకు ముందు బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. 2023 ద్వితీయార్ధంలో బ్రిటన్ మాంద్యంలో కూరుకుపోయింది. డిసెంబర్ క్వార్టర్లో బ్రిటన్ జీడీపీ అంచనాల కంటే దారుణంగా 0.3 శాతం తగ్గింది. ఇక జులై, సెప్టెంబర్ మధ్య బ్రిటన్ ఎకానమీ 0.1 శాతం పడిపోయింది. వాస్తవ జీడీపీలో వరుసగా రెండు క్వార్టర్స్‌లో ప్రతికూల వృద్ధి నమోదైతే సాంకేతిక మాంద్యంగా నిర్వచిస్తారు.
బ్రిటిష్ ఎకానమీ మలుపు తిరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని, తాము ప్రణాళికకు కట్టుబడి ముందుకు సాగాలని, బలమైన ఆర్ధిక వ్యవస్ధ కోసం తాము కార్యకలాపాలు, వ్యాపారాలపై పన్నులు తగ్గించాలని బ్రిటన్ ఆర్ధిక మంత్రి జెరెమి హంట్ పేర్కొనడం గమనార్హం. ఇక బడ్జెట్లో ఎన్నికలకు ముందు పన్ను తగ్గింపుల కోసం ప్రభుత్వ వ్యయాల్లో హంట్ భారీ కోత విధించనున్నారు. ఇక 2022తో పోలిస్తే 2023లో బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ కేవలం 0.1 శాతం వృద్ధి కనబరిచిందని జాతీయ గణాంక కార్యాలయం (ఓఎన్ఎస్) పేర్కొంది.
2024లో ఇది పుంజుకుంటుందనే అంచనాలు ఉన్నా కేవలం 0.25 శాతానికి పరిమితమవుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేసింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు రెండు సంవత్సరాలుగా స్తబ్దుగా ఉన్నా ఎకానమీ విస్తృతి, పరిణతి దృష్ట్యా బ్రిటన్ మాంద్యం కోరల్లో చిక్కుకోవడం అరుదు. అలాంటిది తాజా సంకేతాలు బ్రిటన్ ఎకానమీని కలవరపరుస్తున్నాయి. 2008, 2009లో ప్రపంచ ఆర్ధిక మాంద్యంతో బ్రిటన్ ఎకానమీ దెబ్బతిన్నా ఆ తర్వాత పుంజుకుంది. ఇక కొవిడ్-19తో బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ 2020 ప్రధమార్ధంలో తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంది.
Read More :