UDGAM Portal | బ్యాంకుల్లో సంవత్సరాల కొద్దీగా ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి సమాచారాన్ని వెల్లడించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలకమైన ముందడుగు వేసింది. బ్యాంకుల్లో ఏళ్లకొద్దీ మూలుగుతున్న అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను తెలుసుకునేందుకు ఉద్గమ్ (UDGAM-Unclaimed Deposits – Gateway to Access Information) పేరిట వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. వినియోగదారులు వివిధ బ్యాంకుల్లోని క్లెయిమ్ చేయని డిపాజిట్ల సమాచారాన్ని సులభంగా తెలుసుకునేందుకు ఈ పోర్టల్‌ను తీసుకువచ్చింది.
పోర్టల్ ద్వారా అన్ క్లెయిమ్డ్ మొత్తాన్ని తీసుకునేందుకు, ఆయా ఖాతాలను పునరుద్ధరించేందుకు పోర్టల్ ద్వారా వీలవుతుందని ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకు ఖాతాల్లోని నగదు పదేళ్లు, అంతకంటే మించిన వాడుకలో లేకపోతే దాన్ని అన్క్లెయిమ్డ్ డిపాజిట్‌గా పరిగణిస్తున్నారు. డిపాజిట్‌దారులు క్లెయిమ్ చేయని డిపాజిట్ చేయని నగదు అంతా బ్యాంకుల్లోనే పేరుకుపోతుంది. అలాంటి ఖాతాల వివరాలు ఆర్బీఐ తీసుకువచ్చిన ఉద్గమ్ పోర్టల్ ద్వారా చూసుకునే వీలుంది. ఈ ఏడాది ఏప్రిల్ 6న విడుదల చేసిన డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరి పాలసీపై స్టేట్మెంట్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లెయిమ్ చేయని డిపాజిట్లను ట్రాక్ చేసేందుకు సెంట్రలైజ్డ్ వెబ్‌సైట్‌ను తీసుకువచ్చినట్లు పేర్కొంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (REBIT), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్ (IFTAS) భాగస్వామ్యంతో రూపొందించాయి. ప్రస్తుతానికి వెబ్ పోర్టల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్, సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్, సిటీ బ్యాంక్ ఉన్నాయి. వచ్చే అక్టోబర్ 15 నాటికి మరికొన్ని బ్యాంకుల అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు వివరాలు అందుబాటులోకి రానున్నాయి.