న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: గ్లోబల్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. భారతీయ ఉద్యోగులకు షాకిచ్చింది. దేశంలోని రెండు ప్రధాన ఆఫీసులను మూసేసింది. ఢిల్లీ, ముంబైలోని తమ కార్యాలయాలకు తాళం వేసింది. ఇక్కడి ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని కూడా ఆదేశించినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఎలాన్ మస్క్ చేతికొచ్చిన దగ్గర్నుంచి ట్విట్టర్లో ఒకింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నది చూస్తూనే ఉన్నాం. వ్యయ నియంత్రణ పేరుతో తీవ్ర నిర్ణయాలనే తీసుకుంటున్న యాజమాన్యం.. పెద్ద ఎత్తున ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్‌కూ ఈ సెగ తగిలింది.
కొద్దివారాల క్రితమే..
నిజానికి కొద్దివారాల క్రితమే ఢిల్లీ, ముంబైలోని ఆఫీసులను మూసేశారని, సిబ్బంది ఇండ్ల నుంచే పనిచేస్తున్నారని సమాచారం. కాగా, ఈ నిర్ణయంతో ఎంతమంది ఉద్యోగాలు పోయాయన్న వివరాలు మాత్రం ఇప్పటికైతే తెలియరావడం లేదు. ఈ అంశంపై ట్విట్టర్‌ను మెయిల్ ద్వారా సంప్రదించినా సమాధానం లేదు. అయితే బెంగళూరులోని ట్విట్టర్ కార్యాలయం పనిచేస్తున్నది. ఇక్కడి ఇంజినీరింగ్ సిబ్బంది విధులకు హాజరవుతున్నారని అంటున్నారు. పలు నాటకీయ పరిణామాల మధ్య గత ఏడాది ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లతో మస్క్ సొంతం చేసుకున్న సంగతి విదితమే.
సీఈవోతో కోతలు మొదలు..
ట్విట్టర్ తన చేతికొచ్చిన వెంటనే భారత సంతతి సీఈవో పరాగ్ అగర్వాల్‌ను మస్క్ తొలగించారు. సంస్థ సీఎఫ్‌వో, మరికొందరు ఉన్నతోద్యోగులపైనా వేటుపడింది. ఇందులో తెలుగు రాష్ర్టాలకు చెందిన విజయా గద్దె కూడా ఉన్నారు. ఇలా ఒకప్పుడు 7వేల మందికిపైగా ఉన్న ఉద్యోగులు.. ఇప్పుడు 2,300లకు వచ్చారు. దాదాపు గడిచిన 4 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 5వేల మంది ఉద్యోగాలను కోల్పోవడం గమనార్హం. వీరిలో 200 మంది భారతీయులూ ఉన్నారు.