Koo @ twitter | భారతీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ‘కూ’ ఖాతాను ట్విట్టర్ సంస్థ సస్పెండ్ చేసింది. వినియోగదారుల ప్రశ్నలను ఫీల్డ్ చేయడానికి ఏర్పాటు చేసుకున్న ట్విట్టర్ హ్యాండిల్ @kooeminence శుక్రవారం నిలిపివేశారు. దీనికన్నా ముందు న్యూయార్క్ టైమ్స్, సీఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్‌తో పాటు అనేక మంది ప్రముఖ గ్లోబల్ జర్నలిస్టుల ఖాతాలను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. మార్కెట్లో కూ ఇస్తున్న పోటీ కారణంగా ఆగ్రహంతో వారి ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్విట్టర్ సంస్థ సస్పెండ్ చేసినట్లు పలువురు నమ్ముతున్నారు. కూ ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతిపెద్ద మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫాంగా అవతరించిందని, ప్రస్తుతం ‘కూ’ వినియోగదారుల సంఖ్య 5 కోట్లు దాటిందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిద్వాత్కా గత నెలలో వెల్లడించారు.
‘కూ హ్యాండిల్‌ను ఎందుకు సస్పెండ్ చేశారో తెలియదు. ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ‘కూ’ హ్యాండిల్‌ను ట్విట్టర్లో ఎందుకు నిషేధించారు? మనం ట్విటర్‌తో పోటీ పడుతున్నందుకా? సో? ఈ రోజు మాస్టోడాన్ కూడా బ్లాక్ అయింది. ఇది ఎలాంటి వాక్ స్వాతంత్ర్యం? మనం ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నాం? @elonmusk ఇక్కడ ఏం జరుగుతున్నది? అని కూ సహా వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అప్రమేయ రాధాకృష్ణ ప్రశ్నించారు.
కూ కంపెనీ సమాచారం మేరకు, భారతదేశంలో కాకుండా అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్, కెనడా, నైజీరియా, యూఏఈ, అల్జీరియా, నేపాల్, ఇరాన్ సహా 200 కంటే ఎక్కువ దేశాల్లో కూ యాప్ అందుబాటులో ఉన్నది. కూ 10 భాషల్లో దొరుకుతున్నది. ఈ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాంను 2020 లో బెంగళూరు నుంచి బాంబినెట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది.