TVS X | కుర్రకారు, భారత్‌తోపాటు విదేశాల్లో జడ్’ జనరేషన్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ టూ వీలర్స్ కంపెనీ ‘టీవీఎస్ మోటార్’ సరికొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్’ను ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ టీవీఎస్-ఎక్స్ స్కూటర్ తీసుకొచ్చింది. 4.44 కిలవాట్ల కెపాసిటీ గల హై పెర్ఫార్మెన్స్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న ఈ-టీవీఎస్-ఎక్స్ స్కూటర్ ప్రారంభ ధర రూ.2.50 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. కేవలం 2.6 సెకన్లలో 40 కి.మీ స్పీడ్ అందుకునే సామర్థ్యం గల ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 105 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 10.2-అంగుళాల హెచ్డీ+ టీఎఫ్టీ టచ్ స్క్రీన్, నేవిగేషన్, మ్యూజిక్, వీడియో ఆఫరింగ్స్, గేమింగ్ ఆప్షన్లతో అందుబాటులోకి వస్తున్నదీ స్కూటర్.
టీవీఎస్ మోటార్స్ స్వయంగా డెవలప్ చేసిన బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్.. అనునిత్యం బ్యాటరీ సెల్స్ నుంచి సురక్షితంగా విద్యుత్ సరఫరా అవుతుందా? లేదా? అన్న విషయాన్ని పర్యవేక్షిస్తుంది. 3 కిలోవాట్ల ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 50 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అయ్యే స్మార్ట్ ఎక్స్ హోం రాపిడ్ చార్జర్, 950వాట్ల చార్జర్ సాయంతో 4.30 గంటల్లో 80 చార్జింగ్ అయ్యే పోర్టబుల్ చార్జర్ పొందే ఆప్షన్ కస్టమర్లకు కల్పిస్తోంది టీవీఎస్ మోటార్.
‘యువతలో ఉద్వేగాన్ని రగిల్చే ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్-ఎక్స్ రూ.2,49,990 (ఎక్స్ షోరూమ్, బెంగళూర్) అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటు 950వాట్ల చార్జర్ రూ.16,275 (జీఎస్టీతోపాటు), 3 కిలోవాట్ల స్మార్ట్ ఎక్స్ హోం రాపిడ్ చార్జర్ ఆప్షన్‌గా అందుబాటులో ఉన్నాయి’ అని టీవీఎస్ మోటార్ సీఈఓ కేఎన్ రాధా కృష్ణన్ తెలిపారు.
కంపెనీ వెబ్సైట్లో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. నవంబర్ నుంచి దశల వారీగా దేశంలోని 15 నగరాల్లో డెలివరీ ప్రారంభిస్తారు. 1981-96 మధ్య కాలంలో జన్మించిన వారు మిలినియల్స్, 1996-2010 మధ్య జన్మించిన వారు జనరేషన్ జడ్ కేటగిరీకి చెందిన వారు. బంగ్లాదేశ్, నేపాల్, ఈయూ, లాటిన్ అమెరికా దేశాలకు ఈ స్కూటర్ ఎగుమతి చేస్తామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు తెలిపారు.