మదుపు, పొదుపులకు ఎన్ని మార్గాలున్నా ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)కు మాత్రం ఆదరణ తగ్గడం లేదు. సురక్షిత పెట్టుబడి సాధనాల్లో ఎఫ్డీలు అంత పాపులర్ మరి. అందుకే తరాలు మారుతున్నా.. ఇన్వెస్టర్లలో వీటికుండే గిరాకీ చెక్కుచెదరడం లేదు. దీనికి తగ్గట్టుగానే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు రకరకాల ఎఫ్డీలను మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నాయి. మంత్లీ ఫిక్స్డ్ డిపాజిట్లూ అలా వచ్చినవే. అయితే వీటిలో పెట్టుబడులు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి లంప్సం ఎఫ్డీ నుంచి నెలవారీగా ఆదాయం పొందడమైతే, మరొకటి రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ). అయితే వేర్వేరు ఎఫ్డీల్లో నెలనెలా నిర్దిష్ట మొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా ఉంటుంది. చాలా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల ద్వారా ఈ మార్గాలను మదుపరులు అనుసరించవచ్చు.
ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైనవారు ఈ ఎఫ్డీల ద్వారా నెలవారీ ఆదాయాన్ని ఎంచుకోవచ్చు. 1 నుంచి 5 ఏండ్ల కాలపరిమితిలో ఎఫ్డీ చేసి మెచ్యూరిటీ సమయంలో కాకుండా నెలనెలా మీమీ సేవింగ్స్ ఖాతాల్లో వడ్డీ మొత్తాలు జమయ్యేలా చూసుకోవచ్చు.
ఎవరికి ఉపయోగకరం: రిటైర్మెంట్ అయినవారు, మిగులు నగదు నిల్వలు ఉన్నవారు.. ఇలా ఎవరైనా నెలవారీ ఖర్చులను అధిగమించడానికి వీటిని ఎంచుకోవచ్చు.
వడ్డీరేట్లు: కాలపరిమితి అంతా వడ్డీరేట్లు ఒకేలా ఉంటాయి. సాధారణంగా ఏటా 6-8 శాతం మధ్యలో ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు మాత్రం అదనంగా మరో పావు, అర శాతం (0.25-0.50 శాతం) అధికంగా వడ్డీ ఆదాయం లభించే వీలున్నది.
పన్నులు: ఈ ఎఫ్డీల వడ్డీ ఆదాయంపై మీమీ వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) శ్లాబుల ప్రకారం పన్నులు వర్తిస్తాయి. అయితే వార్షిక వడ్డీ ఆదాయం సాధారణ పౌరులకు రూ.50,000 దాటితే, సీనియర సిటిజన్లకు లక్ష రూపాయలు మించితే.. బ్యాంకులు/ఎన్బీఎఫ్సీలు ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్)ను వసూలు చేస్తాయి.
రికరింగ్ డిపాజిట్: ప్రతి నెలా ఒకేరీతి మొత్తాల్లో పొదుపు చేయడానికి ఇష్టపడేవారు ఆర్డీలను ఎంచుకోవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)లాగే ఉంటుంది. అయితే గ్యారంటీడ్, ఫిక్స్డ్ డిపాజిట్ తరహా రిటర్నులు, తక్కువ మొత్తాల్లో పెట్టుబడులు ఆర్డీల్లో ఉంటాయి. ఎలాంటి ఒడిదుడుకులకు తావులేదు. కాలపరిమితి పూర్తయితే అసలు, చక్రవడ్డీ రెండూ కూడా వస్తాయి.
మల్టీపుల్ ఎఫ్డీలు: ప్రతి నెలా ఓ కొత్త, వేర్వేరు ఎఫ్డీని రకరకాల కాలపరిమితితో ఎంచుకోవచ్చు. ఈ వ్యూహాన్ని ‘ఎఫ్డీ లాడరింగ్’ అంటారు. మెచ్యూరిటీ సమయాల్లో అవసరాలకు ఎక్కువ నగదును అందుకోవచ్చు.