అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ గన్ పేల్చారు.
తమ దేశంలోకి వచ్చే ఔషధ రంగ దిగుమతులపై ఏకంగా 100 శాతం సుంకాలుంటాయని ప్రకటించారు.
వచ్చే నెల మొదలు అమల్లోకి వచ్చే ఈ నిర్ణయంతో భారతీయ ఫార్మా రంగంలో ఒక్కసారిగా ప్రకంపనలు చెలరేగాయి. మన విదేశీ మార్కెట్లలో అగ్రరాజ్యం వాటానే ప్రధానం మరి.
Donald Trump | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సుంకాల మోత మోగించారు. తమ దేశంలోకి వచ్చే అన్ని బ్రాండెడ్, పేటెంటెడ్ ఫార్మాస్యూటికల్స్ దిగుమతులపై అక్టోబర్ 1 నుంచి 100 శాతం సుంకాలుంటాయని అమెరికా కాలమానం ప్రకారం గురువారం తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా ప్రకటించారు. దీంతో భారతీయ ఫార్మా రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మెజారిటీ ఔషధ తయారీ సంస్థలకు అమెరికా మార్కెట్ నుంచి వచ్చే ఆదాయమే కీలకం. ఇప్పుడీ సుంకాలు దానికి గండికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి. కాగా, విదేశీ సంస్థలు అమెరికాలో ఏర్పాటు చేసిన తమ ప్లాంట్లలో ఔషధాలను తయారుచేస్తే, లేదా అమెరికాలో ప్లాంట్ల నిర్మాణం చేపడుతున్నాగానీ ఆయా సంస్థల ఉత్పత్తులపై ఈ సుంకాలు ఉండబోవని ట్రంప్ తెలిపారు. కాగా, భారీ ట్రక్కుల దిగుమతిపై 25 శాతం, కిచెన్ క్యాబినెట్, బాత్రూం వానిటీలపై 50 సుంకాలు పడనున్నాయి.
ట్రంప్ తాజా టారిఫ్‌లు బ్రాండెడ్, పేటెంటెడ్ ఫార్మాస్యూటికల్స్పైనేనని ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు. కాబట్టి భారతీయ ఫార్మా సంస్థలపై ఈ సుంకాల పెద్దగా ప్రభావం ఉండబోదని అంటున్నారు. అమెరికాకు భారత్ నుంచి పెద్ద మొత్తంలో జనరిక్ ఔషధాలే ఎగుమతి అవుతున్నాయని గుర్తుచేస్తున్నారు. కానీ ట్రంప్ తర్వాతి లక్ష్యం జనరిక్ ఔషధాల ఎగుమతులే అయితే భారత్‌కు తిప్పలు తప్పవన్న అభిప్రాయాన్ని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త డాక్టర్ వీకే విజయకుమార్ వ్యక్తం చేస్తున్నారు. కాగా, జనరిక్ ఔషధాలపైనా టారిఫ్‌లు పడుతాయా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదని చాయిస్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్‌కు చెందిన మైత్రీ సేథ్ అంటున్నారు. అయితే 2022లో భారతీయ సంస్థలు ఎగుమతి చేసిన ఔషధాలతో అమెరికన్ల వైద్య ఖర్చులు 219 బిలియన్ డాలర్లు ఆదా అయ్యాయి. 2013-2022 మధ్య 1.3 ట్రిలియన్ డాలర్లని అంచనా. ఇదంతా జనరిక్ ఔషధాల వల్లేనని, కనుక వాటిపై సుంకాలు అమెరికన్లకే నష్టమని భారతీయ పరిశ్రమ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
ఫార్మాపై ట్రంప్ టారిఫ్‌లు ఒక్కసారిగా భారతీయ స్టాక్ మార్కెట్లలోని ఔషధ రంగ సంస్థల షేర్లను షేక్ చేశాయి. నిజానికి అమెరికా మార్కెట్ నుంచి చాలా సంస్థలకు వస్తున్న ఆదాయం జనరిక్ ఔషధాల అమ్మకాలతోనేనని తెలిసినా నష్టాలు తప్పలేదు. శుక్రవారం బీఎస్ఈ ట్రేడింగ్‌లో మదుపరులు భయాందోళనలకు గురికావడంతో వోక్హార్డ్ లిమిటెడ్ షేర్ విలువ అత్యధికంగా 9.40 శాతం క్షీణించింది. అలాగే ఇండొకో రెమెడీస్ 5.35 శాతం, జైడస్ లైఫ్‌సైన్సెస్ 4.21 శాతం, గ్లెన్‌మార్క్ ఫార్మా 2.99 శాతం, నాట్కో ఫార్మా 2.65 శాతం, సన్ ఫార్మా 2.55 శాతం, లుపిన్ 2.07 శాతం, డాక్టర్ రెడ్డీస్ 1.73 శాతం, సిప్లా, అరబిందో ఫార్మా షేర్లూ పడ్డాయి.

సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్‌పై టారిఫ్‌ల ప్రభావం ఉండొచ్చన్న అంచనాలున్నాయి. బ్రాండెడ్ జనరిక్స్‌పై ప్రభావం ఉంటుందా? ఉండదా? అన్నదానిపై అస్పష్టత నెలకొన్నదని ఎస్బీఐ సెక్యూరిటీస్‌కు చెందిన సునీల్ అగర్వాల్ అంటున్నారు. తెలుగు రాష్ర్టాలకు చెందిన ఔషధ రంగ సంస్థ రెడ్డీస్ ఆదాయంలో 47 శాతం అమెరికా మార్కెట్ నుంచే వస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) 1.5 బిలియన్ డాలర్లకు చేరవచ్చని చెప్తున్నారు. గత ఏడాది అరబిందో ఫార్మా అమెరికా అమ్మకాలు 1.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక సన్ ఫార్మా ఆదాయంలో ఈసారి 2.1-2.3 బిలియన్ డాలర్ల వాటా అమెరికాది ఉండొచ్చన్న అంచనాలున్నాయి. ఇందులో 55-57 శాతం ప్రత్యేక బ్రాండ్ల ద్వారానే సమకూరుతున్నది. సిప్లా, లుపిన్, జైడస్, గ్లాండ్ ఫార్మా, ఆల్కెమ్, టొర్రెంట్ ఆదాయాల్లోనూ అమెరికా వాటా 3 బిలియన్ డాలర్లదాకా ఉంటుందని అంచనా.
జనరిక్ ఔషధాలపై ట్రంప్ 100 శాతం టారిఫ్‌లు ఉండవు. పేటెంటెడ్, బ్రాండెడ్ ఉత్పత్తులకే వర్తిస్తాయని ట్రంప్ చెప్తున్నారు. భారతీయ ఫార్మా సంస్థలు జనరిక్ ఔషధాలనే ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి. కనుక మనపై ప్రభావం తక్కువేనని చెప్పవచ్చు.
విదేశాలకు చౌకగా, నాణ్యమైన ఔషధాలను భారత్ ఎంతోకాలం నుంచి సరఫరా చేస్తున్నది. అమెరికా ఔషధ అవసరాల్లో 47 శాతం భారతీయ సంస్థల ద్వారానే తీరుతున్నాయి. ఇక్కడి నుంచి వెళ్లేవి జనరిక్ ఔషధాలే. బ్రాండెడ్, పేటెంటెడ్ ఫార్మాస్యూటికల్స్పైనే టారిఫ్‌లని ట్రంప్ చెప్తున్నారు. కాబట్టి ప్రభావం అంతంతే. ఇప్పటికైతే దేశీయ ఫార్మా ఎగుమతులు సురక్షితమేననుకోవచ్చు.