ప్రతీకార సుంకాలతో హల్చల్ సృష్టించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇక ఇతర పన్నులపై దృష్టిపెట్టారు. మా దేశం మాకే సొంతం అన్న నినాదంతో స్వార్థపూరిత నిర్ణయాలకు దిగుతున్న అగ్రరాజ్యాధినేత.. వలసదారుల కష్టార్జితాన్నీ దోచుకొనేందుకు సిద్ధమయ్యారు. రెమిటెన్స్‌లపై 3.5 శాతం ఎక్సైజ్ ట్యాక్స్‌ను ప్రతిపాదించారు మరి. ఇది అమల్లోకి వస్తే అమెరికాలోని భారతీయులు స్వదేశానికి పంపే ప్రతీ లక్ష రూపాయలపై పన్ను రూపంలో రూ.3,500 నష్టపోవాల్సి వస్తుంది.
న్యూఢిల్లీ, జూన్ 4: అమెరికా సంపదను అమెరికన్లుగాక ఇతరులే అనుభవిస్తున్నారని రగిలిపోతున్న ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరో దెబ్బకొట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ప్రపంచ దేశాలను ప్రతీకార సుంకాలతో షేక్ చేసిన ఆయన.. వలసదారుల కష్టార్జితాన్నీ వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలోనే రెమిటెన్స్‌లపై 3.5 శాతం ఎక్సైజ్ ట్యాక్స్‌ను ప్రతిపాదించారు. ఇది చట్ట రూపం దాల్చితే ఎన్నారై (ప్రవాస భారతీయులు)లు భారత్‌లోని తమ కుటుంబ సభ్యులకు పంపించే నగదుపై పన్ను భారం పడనున్నది. ఇక్కడకు వచ్చే ప్రతీ లక్ష రూపాయలపై రూ.3,500 ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.10 లక్షలకు రూ.35 వేలు, కోటి రూపాయలకు రూ.3.5 లక్షలు నష్టపోవాల్సి వస్తుందన్నమాట.
అమెరికాలో ఎక్కువగా నివసిస్తున్న ఇతర దేశస్తుల్లో భారతీయులు కూడా ఉన్నారు. నిజానికి అమెరికా సంపద సృష్టిలో వలసదారుల పాత్ర చాలా కీలకం. కానీ దీన్ని మరిచి కక్ష సాధింపు చర్యలకు ట్రంప్ దిగుతుండటం ఇప్పుడు అక్కడి వలసదారుల్లో, ప్రధానంగా ఎన్నారైల్లో ఆందోళన కలిగిస్తున్నది. ఎందుకంటే అమెరికాలో ఉంటున్న భారతీయులు తమ సంపాదనలో ఎక్కువ శాతం భారత్‌లోని తమ కుటుంబాలకే పంపుతూంటారు. దీంతో ట్రంప్ ట్యాక్స్ వీరి కష్టార్జితాన్ని మింగేసేలా తయారవుతున్నది. నిజానికి తొలుత 5 శాతం ట్యాక్స్‌ను ప్రతిపాదించారు. కాగా, ఈ ప్రతిపాదిత ట్యాక్స్.. ఇప్పుడున్న ఆదాయ పన్నుల కంటే భారంగా మారుతున్నది. హెచ్-1బీ, ఎల్-1, ఎఫ్-1 వీసాలపై వచ్చే ఎన్నారైలుసహా గ్రీన్‌కార్డ్ హోల్డర్స్నూ అధికంగా ప్రభావితం చేస్తున్నది.
రెమిటెన్స్‌లపై అమెరికా ప్రతిపాదించిన ఎక్సైజ్ ట్యాక్స్ అమలైతే.. భారత్ అనేక రకాలుగా ప్రభావితం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భారత్‌లోని ఎన్నారైల కుటుంబాలకు అందే నగదు మొత్తాలు తగ్గిపోనున్నాయి. అలాగే వారి కొనుగోలు శక్తి కూడా పడిపోనున్నది. స్తిరాస్థి కొనుగోళ్లు క్షీణిస్తాయని, ఇది నిర్మాణ, దాని అనుబంధ రంగాల వృద్ధిని దెబ్బతీస్తుందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం చాలామంది ఎన్నారైలు తాము పంపించే సొమ్ముతో భారత్‌లో ఇండ్లు, ఫ్లాట్లు, భూములనే కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు మరి.
చివరకు ఇది భారత్‌లో పారిశ్రామికోత్పత్తి, వ్యాపార లావాదేవీలు, జీడీపీ వృద్ధిరేటుపైనా ప్రభావం చూపవచ్చని అంటున్నారు. కాగా, భారత్-అమెరికా ద్వంద్వ పన్నుల నిరోధక ఒప్పందానికి (డీటీఏఏ) అమెరికా రెమిటెన్స్ ట్యాక్స్ కొత్త సవాళ్లను తేవచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అయితే ఆదాయ పన్నుకు మాత్రమే డీటీఏఏ వర్తిస్తుందని, ఎక్సైజ్ లేదా లావాదేవీ సుంకాలకు కాదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. దీంతో పన్ను పోటు తప్పేలా లేదు.