గుర్తుంచుకోండి. భారత్ మా(అమెరికా) మిత్ర దేశమే. ఎన్నో ఏండ్లుగా ఆ దేశం (భారత్)తో మాకు సత్సంబంధాలున్నాయి. అయినప్పటికీ అధిక సుంకాల కారణంగా ఆ దేశంతో వ్యాపారం పరిమితంగానే చేయాల్సి వస్తున్నది. ప్రపంచంలోనే దిగుమతులపై అత్యధిక సుంకాలను వేస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉన్నది. ఈ కఠినమైన, అభ్యంతరకర విధానాలు.. ద్రవ్యేతర వాణిజ్య అడ్డంకులకూ దారితీస్తున్నాయి.
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
వాషింగ్టన్, జూలై 30: ప్రతీకార సుంకాలకు పెట్టిన గడువు ముగియడానికి రెండు రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బుధవారం భారత్‌పై 25 శాతం టారిఫ్‌లను విధించారు. దీనిపై జరిమానాలు కూడా ఉంటాయని తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా ప్రకటించారు. తమ దేశంలోకి వచ్చే అన్ని భారతీయ వస్తూత్పత్తుల ఎగుమతులపై ఆగస్టు 1 నుంచి ఇవి వర్తిస్తాయని అందులో స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం పడుతున్న 10 శాతం కనీస సుంకాలకు ఇవి అదనమా? కాదా? అన్నది చెప్పలేదు. జరిమానాలు ఎంత? అన్నదీ ప్రకటించలేదు.
అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా తేలకపోవడం, అమెరికా ప్రతినిధుల బృందం ట్రేడ్ డీల్‌పై 6వ విడుత చర్చల కోసం ఆగస్టు 25 నుంచి భారత్‌లో పర్యటించనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు మంగళవారమే చెప్పిన నేపథ్యంలో అగ్రరాజ్యాధినేత తాజా నిర్ణయం మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నదిప్పుడు. ఇదిలావుంటే ట్రంప్ టారిఫ్‌ల ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నా మని కేంద్రం తెలిపింది. ఇరు దేశాలకు ప్రయోజనకర వాణిజ్య ఒప్పందం కుదురు తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
సైనిక, ఇంధన అవసరాల దృష్ట్యా రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున ఆయుధాలను, చమురును కొంటున్నది. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ తీరును ట్రంప్ తప్పుబడుతున్నారు. ఉక్రెయిన్‌పై దాడులను రష్యా ఆపాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయని, కానీ రష్యాతో వాణిజ్య సంబంధాలను భారత్, చైనాలు అంతకంతకూ పెంచుకుంటూపోతున్నాయని ట్రంప్ ఆక్షేపిస్తున్నారు. దీనివల్ల రష్యాను ఒంటరిని చేద్దామనుకున్న తమ లక్ష్యాలు నెరవేరట్లేదని, ఇదేమీ బాగాలేదంటున్న ట్రంప్.. ఈ క్రమంలోనే భారత్‌పై ఈ అదనపు సుంకాలు, పెనాల్టీలను తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. కాగా, ఇటీవలికాలంలో జపాన్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లనూ ఇదే రీతిలో అధిక సుంకాలు వేస్తామంటూ దారిలోకి తెచ్చుకున్న ట్రంప్.. అదే పాచికను భారత్‌పైనా ప్రయోగిస్తుండటం గమనార్హం.
వాణిజ్య ఒప్పందం కోసం గతకొద్ది నెలలుగా భారత్-అమెరికా మధ్య నడుస్తున్న సంప్రదింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల అమెరికా మెచ్చేలాగే ఈ చర్చలు ఫలప్రదమవుతాయన్న ఆశాభావాన్ని ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ వ్యక్తం చేశారు. కాగా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియుష్ గోయల్ సైతం భారత ప్రయోజనాలు దెబ్బతినకుండానే అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటామన్న విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. త్వరలోనే ట్రేడ్ డీల్ జరుగుతుందన్న ధీమాను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా వెలిబుచ్చుతున్నారు.
అయితే తాను విధించిన ప్రతీకార సుంకాలకు చివరి గడువు ఆగస్టు 1 అని, దీన్ని ఇక పొడిగించేది లేదని ట్రంప్ అంటున్నారు. దీంతో మొత్తం ఈ వ్యవహారంపై తీవ్ర ఉత్కంఠనే నెలకొన్నది. ఈ ఏడాది ఏప్రిల్ 2న భారత్ (26 శాతం)సహా అనేక దేశాలపై ట్రంప్ ప్రతీకార సుంకాలను ప్రకటించిన సంగతి విదితమే. అయితే ఆయా దేశాల ఆందోళనలు, విజ్ఞప్తులు, అభ్యంతరాల మధ్య 90 రోజులపాటు వాయిదా వేసి జూలై 9ని గడువుగా విధించారు. ఆ తర్వాత దీన్ని ఆగస్టు 1కి తీసుకెళ్లారు. అయితే ఏప్రిల్ 2 నుంచి 10 శాతం కనీస టారిఫ్‌లు వర్తిస్తున్నాయి. అలాగే తమ దేశంలోకి వచ్చే ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం, ఆటో రంగ ఉత్పత్తులపై 25 శాతం అదనపు సుంకాలను ట్రంప్ వేశారు.