దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ వారం కూడా ఆటుపోట్లకు అవకాశాలున్నాయి. అమెరికా-ఇరాన్‌ల వైఖరి పశ్చిమాసియాలో సంక్షోభంపై మదుపర్లలో స్పష్టమైన అవగాహనను ఏర్పర్చుకోనివ్వడం లేదు మరి. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాలు మాటలకే పరిమితమవుతుండటం, మరోవైపు హొర్ముజ్ జలసంధిలో అగ్రరాజ్యం కయ్యానికి కాలు దువ్వుతుండటం.. మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నది. ఈ నేపథ్యంలోనే గత వారం సెన్సెక్స్ 249.29 పాయింట్లు పెరిగి 76,913.50 వద్ద ఆగింది. నిఫ్టీ 99.60 పాయింట్లు అందుకొని 23,997.55 దగ్గర నిలిచింది.
లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు.. చివరకు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు.. గ్లోబల్ క్రూడాయిల్ మార్కెట్లను షేక్ చేస్తున్నాయి. బ్యారెల్ ముడి చమురు ధర 110-125 డాలర్ల మధ్య కదలాడుతున్నది. ఈ పరిణామం సహజంగానే భారతీయ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నది. ఈ క్రమంలోనే ఈ వారం మదుపర్లు అమ్మకాలు, పెట్టుబడుల నడుమ కొట్టుమిట్టాడవచ్చన్న అంచనాలు మెజారిటీ నిపుణుల నుంచి వస్తున్నాయి.
ఇక జనవరి-మార్చికిగాను కార్పొరేట్ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాల ప్రభావం సైతం మార్కెట్ ట్రేడింగ్‌పై గట్టిగానే ఉండనున్నది. అలాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, రూపాయి విలువ, విదేశీ మదుపర్ల పెట్టుబడులూ ప్రధానమే. కాగా, అమ్మకాల ఒత్తిడి నెలకొంటే నిఫ్టీకి 23,500 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,300 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 24,200-24,500 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చనీ చెప్తున్నారు.
గమనిక..: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవ డం ఉత్తమం. అలాగే పై న పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.