Train Travel Insurance | ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో రైల్లో ప్రయాణిస్తుంటారు. 1.10 లక్షల కి.మీ. విస్తీర్ణంతో కూడిన నెట్వర్క్ కల భారతీయ రైల్వేస్.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రైల్వే సంస్థ. చౌక ధరలోనే అత్యధికులకు అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గం ఇది. నిత్యం వేల మంది రైల్లో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికుల సేఫ్టీతోపాటు వారికి వసతుల కల్పనకు భారతీయ రైల్వేస్ పలు చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కల్పిస్తున్నది.
పలువురు వ్యక్తులు టికెట్ బుకింగ్ సమయంలోనే బీమా ఆప్షన్ నిర్లక్ష్యం చేస్తారు. నిత్యం ప్రమాదాల గురించి వింటున్నా.. ఇన్సూరెన్స్‌పై పెద్దగా శ్రద్ధ వహించరు. అనూహ్య యాక్సిడెంట్ జరిగితే కష్టకాలంలో ఆదుకునేది కేవలం బీమా పాలసీ మాత్రమే. అందుకోసమే ప్రయాణికుల సేఫ్టీ కోసం `ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ` అనే పేరుతో ఐఆర్సీటీసీ ద్వారా భారతీయ రైల్వేస్ ఇన్సూరెన్స్ అందిస్తున్నది. కేవలం 35 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్ వసతి కల్పిస్తున్నది.
దేశంలోని ఏ రైలులో ప్రయాణించేవారెవరైనా ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం పొందొచ్చు. ఆన్లైన్/ మొబైల్ యాప్ ద్వారా టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్యాసింజర్లకు మాత్రమే ఈ ఫెసిలిటీ లభిస్తుంది. ఐదేండ్ల లోపు బాలలు, విదేశీయులకు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తించదు. టికెట్ బుకింగ్ టైమ్‌లోనే ఇన్సూరెన్స్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే.. టికెట్ రిజర్వేషన్ కన్ఫర్మ్ కాగానే సంబంధిత ప్రయాణికుడి మొబైల్‌కు, ఈ-మెయిల్‌కు మెసేజ్ వస్తుంది. నామినీ వివరాలు నమోదు చేయడానికి ఓ లింక్ కూడా పంపుతారు. క్యాన్సిలేషన్‌కు చాన్స్ ఉండదు. పీఎన్ఆర్ కింద బుక్ చేసుకున్న టికెట్ బుకింగ్స్‌కు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
ఐఆర్సీటీసీ వెబ్సైట్/ యాప్ నుంచి చేసుకునే టికెట్ బుకింగ్‌కు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం లేని వారు ఈ ఫెసిలిటీ అందుకోలేరు. నేరుగా రైల్వే స్టేషన్ కౌంటర్లో టికెట్ తీసుకున్నా ఇన్సూరెన్స్ వర్తించదు. ఇండియన్స్‌కు మాత్రమే ఇన్సూరెన్స్ లభిస్తుంది. మనదేశంలో పని చేస్తున్న/ పర్యటిస్తున్న విదేశీయులకు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వీల్లేదు.
టికెట్ తీసుకున్న వ్యక్తి మరణించినా, అంగ వైకల్యానికి గురైనా, గాయపడినా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. లగేజీ దొంగతనానికి గురైనా, రైలు ఆలస్యంతో జరిగే నష్టానికి, భోజనం తదితర ఖర్చులకు బీమా సౌకర్యం రాదు. ఐఆర్సీటీసీ సెలెక్ట్ చేసిన బీమా కంపెనీల నుంచి మాత్రమే ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది. మనకు నచ్చిన సంస్థలో బీమా తీసుకోవడానికి అవకాశం లేదు.