TRAI | బ్యాంకింగ్ సేవలు, ఈ-కామర్స్ సంస్థల ఓటీపీ మెసేజ్‌లు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఆలస్యం అవుతాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) కొట్టి పారేసింది. సైబర్ మోసాలను అరికట్టేందుకు ఎస్ఎంఎస్లు ఎక్కడ నుంచి వస్తుందో గుర్తించాలని టెలికం సంస్థలకు ఇచ్చిన ఆదేశాల వల్ల మెసేజీల డెలివరీలో ఎటువంటి జాప్యం ఉండబోదని తెలిపింది. ఓటీపీ మెసేజ్‌లు సత్వరం అందుతాయని వివరించింది. ఓటీపీ మెసేజ్‌లు ఆలస్యం అవుతాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొంటూ ట్రాయ్ ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’లో పోస్ట్ చేసింది.
స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లకు చెక్ పెట్టడానికి ట్రాయ్ చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా బల్క్ ఎస్సెమ్మెస్‌లు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలని టెలికం సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఫ్రాడ్ మెసేజ్‌లు అరికట్టడమే లక్ష్యంగా ట్రేసబిలిటీ విధానం తెచ్చింది ట్రాయ్. తొలుత నవంబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని భావించినా.. టెలికం సంస్థలు సన్నద్ధం కాకపోవడంతో ఈ నెలాఖరు వరకూ పొడిగించింది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రతి ఎస్ఎంఎస్ మూలాన్ని టెలికం సంస్థలు తప్పనిసరిగా గుర్తించాల్సిందే.