Market Pulse | దేశీయ స్టాక్ మార్కెట్లు రివర్స్‌గేర్‌లోనే నడుస్తున్నాయి. గత వారంలోనూ నిరాశపర్చాయి. ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడిలో ఉండిపోతున్నారు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 428.87 పాయింట్లు లేదా 0.55 శాతం దిగజారి 76,190.46 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 111 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 23,092.20 దగ్గర ఆగింది. అయితే ఈ వారం బడ్జెట్ అంచనాలు, నిర్ణయాలు.. మార్కెట్లకు దిక్సూచిగా ఉండనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇది శనివారమైనప్పటికీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ జరుగనున్నది. సాధారణంగా శని, ఆదివారాలు స్టాక్ మార్కెట్లకు సెలవు అన్న విషయం తెలిసిందే.
దీంతో బడ్జెట్‌ను ఇన్వెస్టర్లు మెచ్చితే సూచీలు పైకి, లేకుంటే కిందికి అనుకోవచ్చు. ప్రధానంగా ఆయా రంగాల షేర్లను పన్నులు, ప్రోత్సాహకాలు నడిపిస్తాయని చెప్పవచ్చు. ఆదాయ పన్నుల్లో ఊరట లభిస్తే ఆటో, రియల్టీ, బ్యాంకింగ్ షేర్లకు ఊతమిచ్చినట్టే. అలాకాకున్నా ఇవే ముందుగా ప్రభావితం కావచ్చు. ఇక డాలర్‌తో పోల్చితే ఇంకా ఆమోదయోగ్యం కాని స్థాయిల్లోనే కొట్టుమిట్టాడుతున్న రూపాయి మారకం విలువ.. మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నది. గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలూ కీలకమే. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 22,700 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,500 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 23,300-23,500 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
గమనిక..: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.