Toyota – Maruti | ప్రముఖ కార్ల తయారీ సంస్థలు మారుతి సుజుకి, టయోటా కిర్లోస్కర్ మధ్య టెక్నాలజీ బదిలీ ఒప్పందం ఉంది. దీన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ కొనసాగించాలని రెండు సంస్థలు నిర్ణయించాయి. భారత్‌లో గుజరాత్ రాష్ట్రంలో మారుతి సుజుకి తన ఎస్యూవీ స్టైల్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) కారు తయారు చేస్తోంది. దీని టెక్నాలజీని వచ్చే ఏడాది వసంత కాలానికి టయోటాకు మారుతి సుజుకి బదిలీ చేయనున్నది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై సుజుకి, టయోటా మధ్య సహకారం ఇదే తొలిసారి.
60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో ఈవీ కారును మారుతి సుజుకి, టయోటా కో డెవలప్ చేస్తున్నాయి. 2026 నాటికల్లా 10 బ్యాటరీ పవర్డ్ ఈవీ వెహికల్స్ మార్కెట్లో ఆవిష్కరించాలని టయోటా కిర్లోస్కర్ లక్ష్యంగా పెట్టుకున్నది. మారుతి సుజుకి ఇంకా గ్లోబల్ మార్కెట్లలో ఈవీ కారును ఆవిష్కరించలేదు గానీ, భారత్ లోని టయోటా యూనిట్ లో తయారు చేసిన హైబ్రీడ్ మోడల్ కార్లను మారుతి విక్రయిస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని కార్ల మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో ఏటా 2.50 లక్షల ఈవీ కార్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. జపాన్, యూరప్ దేశాలతోపాటు ప్రపంచ దేశాలకు ఈవీ కార్లను సరఫరా చేయాలని మారుతి సుజుకి భావిస్తోంది.
ఈ ఏడాది టయోటా ప్రపంచవ్యాప్తంగా 1.08 లక్షలకు పైగా బ్యాటరీ పవర్డ్ ఈవీ కార్లను విక్రయించింది. మొత్తం గ్లోబల్ ఈవీ కార్ల విక్రయాల్లో టయోటా వాటా 1.5 శాతం. ఇందులో ప్రీమియం లెక్సస్ బ్రాండ్ కార్లు ఉన్నాయి. తొలి నుంచి మారుతి సుజుకి, టయోటా కిర్లోస్కర్ మధ్య కార్ల తయారీ టెక్నాలజీ ఒప్పందాన్ని వ్యూహాత్మకంగా ఈవీ కార్లకు విస్తరించాలని భావిస్తున్నాయి.