Toyota Innova Highcross | పర్సనల్ మొబిలిటీ మొదలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వరకూ పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్ వెహికల్సే.. ఇప్పుడిప్పుడే పెట్రోల్ లేదా డీజిల్‌కు ఆల్టర్నేటివ్గా ఎలక్ట్రిక్ కం బయో ఫ్యుయల్.. ఇథనాల్ ఆధారిత వెహికల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా 100 శాతం ఇథనాల్ (100% ethanol) తో నడిచే కారు మార్కెట్లోకి వచ్చేసింది.
కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union Road Transport and Highways Minister Nitin Gadkari) మంగళవారం 100 శాతం ఇథనాల్ (100% ethanol) తో నడిచే కారు ‘టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Highcross)’ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రొటోటైప్ వెహికల్ ఇది. రెండోదశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా టయోటా ఇన్నోవా హైక్రాస్ ((Toyota Innova Highcross) రూపుదిద్దుకున్నది.
ఈ కారులో ఇథనాల్ ద్వారా 40 శాతం విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో లీటర్ పెట్రోల్ రూ.109 పలుకుతుండగా, లీటర్ ఇథనాల్ సుమారు రూ.60 మాత్రమే. అంటే పెట్రోల్ కంటే అత్యంత ఎకనామికల్.
100 శాతం ఇథనాల్‌తో నడిచే టయోటా ఇన్నోవా హైక్రాస్ కారును ఆవిష్కరించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక సమస్య లేవనెత్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపులు ఉండగా, ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటవుతున్నాయి కానీ ఇథనాల్ పంపులు ఎక్కడా లేవు. పెట్రోలియం కంపెనీలు ఇక నుంచి ఇథనాల్ పంపులను ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని నితిన్ గడ్కరీ కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా పాల్గొన్నారు.
ఇప్పటికే దేశంలో టయోటా, మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కార్ల తయారీ సంస్థలు ఫ్లెక్సీ ఫ్యూయల్ కార్లు తయారు చేస్తున్నాయి. గతేడాది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ టయోటా మిరాయి ఫ్లెక్స్ ఫ్యుయల్ కారు ఆవిష్కరించారు. టయోటా మిరాయి కారు హైడ్రోజన్ పవర్డ్ కారు.