న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ప్రధాని నరేంద్ర మోది సన్నిహిత మిత్రుడిగా పేరొంది, తీవ్ర ఆరోపణల నడుమ కొట్టుమిట్టాడుతున్న బిలియనీర్ వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ గ్రూప్‌కు మరో షాక్ తగిలింది. గ్రూప్ ప్రతిపాదించిన 50 బిలియన్ డాలర్ల హైడ్రోజన్ ప్రాజెక్టులో భాగస్వామ్యం తీసుకోవాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి నిలిపివేసినట్టు ఫ్రాన్స్ ఇంధన దిగ్గజం టోటల్ ఎనర్జీస్ మంగళవారం వెల్లడించింది. రెండు అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇప్పటికే టోటల్ ఎనర్జీస్ భాగస్వామిగా ఉంది.
అదానీ గ్రూప్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో భాగస్వామ్యాన్ని గత ఏడాది జూన్‌లోనే ప్రకటించినప్పటికీ, టోటల్ ఎనర్జీస్ ఇంకా కాంట్రాక్టుపై సంతకాలు చేయలేదు. గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్‌లో వచ్చే పదేండ్లలో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడితో చేసి, 2030కల్లా 10 లక్షల టన్నుల ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యంతో అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరుతో అదానీ గ్రూప్ ఒక కంపెనీని నెలకొల్పింది. దీనిలో 4 బిలియన్ డాలర్లు (రూ.33,000 కోట్లు) పెట్టుబడి చేసి, 25 శాతం వాటా తీసుకోనున్నట్టు 2022 జూన్‌లో టోటల్ ఎనర్జీస్ ప్రకటించింది.
తాజాగా ఫ్రాన్స్ సంస్థ సీఈవో పాట్రిక్ పౌయానే ఒక ఎర్నింగ్స్ కాల్లో మాట్లాడుతూ ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని ‘హోల్డ్’లో పెట్టామన్నారు. అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ ఆరోపణలపై ఆడిట్ నివేదిక ఫలితాల కోసం హైడ్రోజన్ ప్రాజెక్టులో పెట్టుబడి ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టామన్నారు. ‘దీనిని (హైడ్రోజన్ ప్రాజెక్టులో పెట్టుబడులు) ప్రకటించాం. అంతే! సంతకాలేవీ జరగలేదు. మిస్టర్ అదానీ ఇప్పుడు చూడాల్సిన ఇతర అంశాలెన్నో ఉన్నాయి. ఆడిట్ జరుగుతున్నప్పుడు అటువంటి విషయాలను (తమ పెట్టుబడి) నిలిపివేయడమే మంచిది’ అంటూ పాట్రిక్ వివరించారు.
అదానీ గ్రూప్‌లో టోటల్ పెట్టుబడులు 3 బిలియన్ డాలర్లు
అదానీ గ్రూప్‌లో టోటల్ ఎనర్జీస్ ఇప్పటికే 3.1 బిలియన్ డాలర్లు (రూ.25,500 కోట్లు) పెట్టుబడి చేసింది. అదానీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, సోలార్ ప్రాజెక్టులో పెట్టుబడులున్నాయి. ఈ వ్యాపారాలకు వెనుక తగిన ఆస్తులున్నాయని పాట్రిక్ తెలిపారు. అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ కంపెనీలకు భాగస్వామిగా ఉంది. అదానీ కంపెనీల్లో పెట్టుబడి చేసే ముందు, ఆయా కంపెనీలను పూర్తిగా తనిఖీ చేశామని టోటల్ ఎనర్జీస్ సీఈవో చెప్పారు. తాము ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి అదానీ గ్రీన్, అదానీ టోటల్ షేర్లు ఇప్పటికీ 2 రెట్లు, 8 రెట్లు చొప్పున పెరిగి ఉన్నాయన్నారు.
టోటల్ ఎనర్జీస్ ఒక లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) వెంచర్ కోసం తొలుత 2018లో అదానీతో చేతులు కలిపింది. అటుతర్వాత 2020-21లో అదానీ గ్రీన్ ఎనర్జీలో 19.75 శాతం వాటాను కొని, సోలార్ వ్యాపారంలో 2.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి చేసింది. ఆటోమొబైల్స్‌కు సీఎన్జీని, గృహాలు, పరిశ్రమలకు పైప్డ్ నేచురల్ గ్యాస్‌ను సరఫరా చేసే అదానీ టోటల్ గ్యాస్‌లో ఫ్రాన్స్ సంస్థ 37.4 శాతం వాటా తీసుకుంది.