Toshiba Layoffs | ప్రముఖ జపనీస్ టీవీ తయారీ కంపెనీ టోషిబా పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసింది. జపాన్‌లో 4000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్టు టోషిబా గురువారం వెల్లడించింది. నూతన యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిన టోషిబా కంపెనీ సామర్ధ్యం మెరుగుపరిచే క్రమంలో లేఆఫ్స్‌కు తెగబడినట్టు సమాచారం. లేఆఫ్స్‌తో కంపెనీలో పనిచేస్తున్న జపాన్ ఉద్యోగుల్లో దాదాపు 6 శాతం మందిపై ప్రభావం పడనుంది. మరోవైపు కార్యాలయాన్ని సెంట్రల్ టోక్యో నుంచి కవసాకి తరలించేందుకు కూడా కంపెనీ సన్నాహాలు చేపట్టింది.
ఉద్యోగులపై వేటుతో పాటు వ్యయ నియంత్రణ చర్యలతో రాబోయే మూడేండ్లలో కంపెనీ లాభాల బాట పడుతుందని టోషిబా యోచిస్తోంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జపాన్ ఇండస్ట్రియల్ పార్టనర్స్ 13 బిలియన్ డాలర్లకు టోషిబాను కొనుగోలు చేయడంతో గత ఏడాది డిసెంబర్లో కంపెనీని స్టాక్ మార్కెట్ నుంచి తొలగించారు.
టోషిబా కొత్త యజమానుల చేతుల్లోకి చేరడంతో దాదాపు దశాబ్ధం పాటు కంపెనీ ఎదుర్కొన్న సమస్యలు, స్కామ్‌లు, ఆర్ధిక సంక్షోభం నుంచి టోషిబా గట్టెక్కినట్టయింది. రాబోయే మూడేండ్లలో పది శాతం లాభాల మార్జిన్ అందుకోవాలని లక్ష్యంగా టోషిబా నిర్ధేశించుకుంది. కంపెనీని నిలకడగా, పటిష్టంగా చేసే క్రమంలో టోషిబా పునర్వ్యస్ధీకరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఇక జపాన్‌లో ఇటీవల పలు కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. టోషిబాతో పాటు ఫొటోకాపీమేకర్ కొనికా మినోల్టా ఉద్యోగుల కుదింపును ప్రకటించింది.
Read More :
Maya Tata | టాటాల వారసురాలు.. వ్యాపార రంగంలో మహిళల సత్తా చాటుతుందా?