న్యూఢిల్లీ : చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్, నూతన టెక్నాలజీతో కొలువుల కోత (Job Loss) తప్పదనే ఆందోళన నడుమ స్టెబిలిటీ ఏఐ సీఈవో ఇమద్ మొస్టాక్ బాంబు పేల్చారు. రాబోయే రెండేండ్లలో కోడర్స్ ముఖ్యంగా ఇండియన్ కోడర్స్ ఉద్యోగాలు కోల్పేయే ముప్పు పొంచిఉందని అన్నారు. ఐటీ ఉద్యోగాలను అధికంగా ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చే భారత్ వంటి పలు దేశాల్లో రాబోయే కొన్నేండ్లలో గడ్డు పరిస్ధితి నెలకొనే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
కోడ్స్ రాయడం, చదవడం, సమీక్షించడం వంటి పనులను బహుళజాతి కంపెనీలు ఏఐ టూల్స్‌తో పూర్తి చేయించే అవకాశం ఉండటంతో ఈ మార్కెట్లలో ఉద్యోగాలు కనుమరుగయ్యే పరిస్ధితి నెలకొందని చెప్పారు. ఇక వచ్చే ఏడాది నాటికి చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ మొబైల్ ఫోన్లలోనూ అందుబాటులో ఉంటాయని ఓ పాడ్‌కాస్ట్‌లో స్టెబిలిటీ సీఈవో మొస్టాక్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
దీంతో ఇంటర్నెట్ లేకుండానే యూజర్లు సెకండ్ల వ్యవధిలోనే టెక్ట్స్, ఇమేజ్‌లను వాడటంతో పాటు జనరేట్ చేసే వెసులుబాటు ఉంటుంది. యూజర్లు తమ అరచేతిలోనే సమాచారాన్ని యాక్సెస్ చేసుకునే వీలు కలుగుతుంది. మరోవైపు ఏఐ పర్యవసానాలు, ప్రైవసీతో పాటు ఉద్యోగాలు కాపాడటం వంటి అంశాలకు సంబంధించి ఏఐ టూల్స్‌పై నియంత్రణ ఉండాలని ఓపెన్ఏఐ సీఈవో సామ్ అల్ట్మన్ వంటి టెక్ దిగ్గజాలు కోరుతున్నారు.