న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: స్టాక్ మార్కెట్ దాదాపు రికార్డుస్థాయికి సమీపంలో ట్రేడవుతున్న నేపథ్యంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి మదుపరుల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. జనవరి నెలలో ఈ ఫండ్స్‌లోకి రూ. 21,780 కోట్లు తరలివచ్చాయి. ఇంత మొత్తం రావడం రెండేండ్లలో ఇదే ప్రధమం. డిసెంబర్లో వచ్చిన రూ. 16,997 కోట్లకంటే జనవరిలో నిధుల ప్రవాహం 28 శాతం పెరిగినట్టు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ (యాంఫి) గురువారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా నెలవారీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్‌లు) ద్వారా ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయిలో రూ. 18,838 మదుపు నిధులు వచ్చాయి. డిసెంబర్లో సిప్‌ల్లో మదుపరులు రూ. 17,610 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
కొత్తగా 51.84 లక్షల సిప్ రిజిస్ట్రేషన్లు జరగడంతో మొత్తం సిప్ ఖాతాల సంఖ్య 7.92 కోట్లకు చేరింది. జనవరి నెలలో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను దీర్ఘకాలిక మదుపుగా భావించిన ఇన్వెస్టర్లు పెట్టుబడుల్ని పెంచుకుంటున్నారని ప్రభుదాస్ లీలాధర్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ హెడ్ పంకజ్ శ్రేష్ట చెప్పారు. 2022 మార్చి (రూ.28,463 కోట్లు) తర్వాత ఈ ఏడాది జనవరిలోనే ఈక్విటీ ఫండ్స్ అధిక పెట్టుబడుల్ని ఆకర్షించాయి. అన్ని విభాగాల ఫండ్స్‌లోకి అధికంగా థీమటిక్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి నిధులు వచ్చాయి. థీమటిక్ ఫండ్స్‌లోకి రూ.4,805 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.3,257 కోట్లు రాగా, మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.3,039 కోట్లు ఆకర్షించాయి.