Gold Price | న్యూఢిల్లీ, జనవరి 31 : బంగారం భగభగమండుతున్నది. రోజుకొక రికార్డు స్థాయికి చేరుకుంటున్న పుత్తడి విలువ శుక్రవారం మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడంతో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో శుక్రవారం ఒకేరోజు 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.1,100 పెరిగి చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.85 వేలకు చేరువైంది.
బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి పదిగ్రాముల ధర రూ.84,900గా నమోదైంది. ధరలు ఈస్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. జనవరి నెలలో బంగారం ధర రూ.5,510 లేదా 7 శాతం ఎగబాకింది. జనవరి 1న పుత్తడి ధర రూ.79,390గా ఉన్నది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర రూ.1,100 అధికమై రూ.84,500 పలికింది. ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం పరుగులు పెట్టింది. 24 క్యారెట్ పదిగ్రాముల ధర రూ.1,310 అధికమై రూ.84,330 పలికింది. అంతకుముందు ఇది రూ. 83 వేలుగా ఉన్నది. అలాగే 22 క్యారెట్ విలువ రూ.1,200 ఎగబాకి రూ. 77,300కి చేరుకున్నది.
పసిడితోపాటు వెండి పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో వెండి ధర రూ.95 వేలు పలికింది. కిలో ధర రూ.850 పెరిగినట్లు అయింది. అంతకుముందు ఇది రూ.94,150గా ఉన్నది. ఇటు హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,000 ఎగబాకి రూ.1.07 లక్షలు పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,800 డాలర్లు అధిగమించడం వల్లనే దేశీయంగా తొలిసారిగా 84 వేల మార్క్‌ను అధిగమించిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ ఉన్నతాధికారి సౌమిల్ గాంధీ తెలిపారు. ఫ్యూచర్ ట్రేడ్ మార్కెట్లో ఫిబ్రవరి నెలకుగాను రూ.487 పెరిగి రూ.82,210 పలికిందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్లో అతి విలువైన లోహాలపై సుంకాలు తగ్గిస్తే ధరలు తగ్గే అవకాశాలున్నాయన్నారు. మెక్సికో, కెనడాలపై అమెరికా సుంకాలను విధించడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లిస్తుండటం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అలాగే పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తుండటం కూడా మరో కారణం.