Twitter Vs Threads | ఎలన్ మస్క్ సారధ్యంలోని మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ (Twitter)కు పోటీగా మార్క్ జుకర్ బర్గ్ ఆధ్వర్యంలోని మెటా (Meta) మరో టెక్ట్స్ బేస్డ్ సంభాషణల యాప్ తెస్తున్నది. ట్విట్టర్’ను పోలి ఉన్న ఫీచర్లతో గల ఈ యాప్‌కు ‘థ్రెడ్స్ (Threads)’ అనే పేరు పెట్టనున్నట్లు సమాచారం. ట్విట్టర్ పోటీ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్.. ఒకటి, రెండు రోజుల్లో యూజర్లకు పరిచయం చేసేందుకు మెటా రంగం సిద్ధం చేసినట్లు తెలియవచ్చింది. కానీ, దీనిపై అధికారికంగా మెటా మేనేజ్మెంట్ రియాక్ట్ కాలేదు.
తన ఇన్స్టాగ్రామ్ (Instagram) బ్రాండ్ మీద మెటా తీసుకొస్తున్న ఈ యాప్‌లో టెక్ట్స్ రూపంలోని పోస్టుల్నే లైక్ చేయొచ్చు. కామెంట్, షేరింగ్ వెసులుబాటు ఉండొచ్చునని సమాచారం. ఈ మేరకు యాప్ స్టోర్ లిస్టింగ్‌లోనూ ‘థ్రెడ్స్’ స్క్రీన్ షాట్ జోడించినట్లు వినికిడి. ఇన్ స్టా గ్రామ్ యూజర్లే.. థ్రెడ్స్ యాప్ లోనూ ఫాలో అయ్యే చాన్స్ ఉంది. తాము కొత్తగా తీసుకొస్తున్న యాప్ విషయమై స్పందించడానికి ఇన్ స్టాగ్రామ్ ముందుకు రాలేదు.
ట్విట్టర్’ను ఎలన్ మస్క్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి సంస్థలో పలు మార్పులు జరిగాయి.. జరుగుతున్నాయి. కొత్త ట్వీట్లను చూడటానికి యూజర్లకు పరిమితులు విధించింది నూతన మేనేజ్మెంట్. ట్విట్టర్లో పాలసీ పరమైన మార్పులు ఇష్టపడని వారు ప్రత్యామ్నాయ వేదికల కోసం ఎదురు చూస్తున్న వేళ.. ఫేస్ బుక్ పేరెంట్ సంస్థ మెటా.. కొత్త మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ సిద్ధం చేయడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. ట్విట్టర్’కు గల పాపులారిటీతోపాటు ఇప్పుడు ఆ సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న మెటా.. సరికొత్త యాప్ తయారు చేసినట్లు సమాచారం.
అంతే కాదు.. యూజర్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వివిధ రంగాల సెలబ్రిటీలు, ప్రభావ శీలురతో భారీగా ప్రచారం చేస్తారని సమాచారం. ట్విట్టర్’కు పోటీగా ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే తీసుకొచ్చిన బ్లూ స్కై, మాస్టోడాన్ తెచ్చిన యాప్‌లు ప్రజలను ఆకట్టుకోకపోవడం గమనార్హం.
Meta-Twitter | ట్విట్టర్ వర్సెస్ ఇన్‌స్టా .. వచ్చేనెలలో మరో యాప్..?