RBI | న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ఈసారి కూడా రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు భగ్గుమంటుండటంతో ఆహార ద్రవ్యోల్బణ సూచీ గరిష్ఠ స్థాయిలోనే నమోదవుతుండటంతో బుధవారం ప్రకటించనున్న తన పరపతి సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనావేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మాత్రం వడ్డీరేట్లను అర శాతం తగ్గించేందుకు ఆస్కారం ఉన్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ ఎండీ, సీఈవో ధీరజ్ రెల్లి తెలిపారు.
వరుసగా పది సమీక్షలో వడ్డీరేట్లను ముట్టుకోకపోవడంతో రెపోరేటు 6.50 శాతం వద్ద కొనసాగుతున్నది. దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉండటం, పశ్చిమ దేశాల్లో యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నదని, ఈ నేపథ్యంలో వచ్చే రెండు సమీక్షల్లో ప్రస్తుత రేట్లను కొనసాగించే అవకాశాలున్నాయన్నారు. తొలి త్రైమాసికంలో వృద్ధి 7.5 శాతం సాధించింది.