న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఎయిర్ ఇండియాను బిడ్డింగ్‌లో పొందడం టాటా గ్రూప్ చరిత్రలో ఒక మైలురాయి అని ఆ గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. మరో ‘కఠిన సంవత్సరం’ ముగింపు సందర్భంగా ఉద్యోగులకు సందేశం ఇస్తూ ఎయిర్ ఇండియా కొనుగోలు చేయడం ఒక చరిత్రాత్మక సంఘటనగా అభివర్ణించారు. 2021లో టాటా గ్రూప్ కంపెనీలు మంచి ఆర్థిక పనితీరును ప్రదర్శించడమే కాకుండా గ్రూప్ నిర్దేశించుకున్న పరివర్తన దిశలోకి విజయవంతంగా పయనించాయన్నారు. రాబోయే రోజుల్లో నాలుగు థీమ్‌లను-డిజిటల్, కొత్త ఇంధనం, సజావు సరఫరా, ఆరోగ్య సంరక్షణ-అవలంబించడం గ్రూప్ వ్యూహమన్నారు. గ్రూప్ కొత్త వ్యాపారాలైన 5జీ, టాటాన్యూ, టాటా ఎలక్ట్రానిక్స్లు ఈ నాలుగు థీమ్‌ల ద్వారా లబ్ది పొందుతాయని చంద్రశేఖరన్ వివరించారు.
అప్పగింతలో జాప్యం
ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్‌కు అప్పగింతలో మరో నెల జాప్యం జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. ఎయిర్ ఇండియాలో పూర్తి వాటా కొనుగోలుకు టాటా గ్రూప్ బిడ్‌ను ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన లావాదేవీలన్నీ డిసెంబర్ చివరినాటికల్లా పూర్తవుతాయని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. అయితే ఇంకా కొన్ని లావాదేవీలకు మరింత సమయం పడుతుందని, నియంత్రణా పరమైన అనుమతులు రావాల్సి ఉందని, దీంతో ఎయిర్ ఇండియా..టాటా గ్రూప్ చేతికి వెళ్లేందుకు మరో నెలరోజులు పడుతుందని ఆ అధికారి వివరించారు. ఈ ప్రక్రియ జనవరికల్లా పూర్తికావొచ్చన్నారు.