Electric Cars | పెట్రోల్ బిల్లు భారంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఆల్టర్నేటివ్ ఫ్యుయల్తో నడిచే వాహనాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రజలు సైతం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేకించి పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏడాదికేడాది ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈవీ కార్ల రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై, దాని శివారున గల పుణె నగరాల్లోనే ఇప్పటి వరకూ ఈవీ కార్ల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగేవి.
కానీ దక్షిణాది రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరులో 2023లో ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లు పెరిగాయి. దీంతో ఈవీ కార్ల రిజిస్ట్రేషన్లలో ఢిల్లీ, ముంబై, పుణె నగరాలను బెంగళూరు దాటేసింది. గతేడాది బెంగళూరులో 8,690 ఈవీ కార్ల రిజిస్ట్రేషన్ జరిగింది. 2022తో పోలిస్తే 121.2 శాతం వృద్ధిరేటు నమోదైంది. 2022లో బెంగళూరులో కేవలం 2,479 ఈవీ కార్ల రిజిస్ట్రేషన్ మాత్రమే జరిగిందని జాటో డైనమిక్స్ ఇండియా నివేదిక తెలిపింది.
దేశవ్యాప్తంగా గతేడాది 87,927 ఈవీ కార్ల రిజిస్ట్రేషన్ జరిగింది. 2022తో పోలిస్తే 143.7 శాతం ఎక్కువ. బెంగళూరు తర్వాత 2023లో 8,211 ఈవీ కార్ల రిజిస్ట్రేషన్లలో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్లో 6,408, ముంబైలో 5,425, పుణెలో 3,991 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి.2022లో 4,745 ఎలక్ట్రిక్ కార్ల రిజిస్ట్రేషన్లతో ముంబై మొదటి స్థానంలో నిలిస్తే, 3748 యూనిట్లతో ఢిల్లీ, 2914 కార్లతో పుణె, 2,479 యూనిట్లతో బెంగళూరు, 2,225 ఈవీ కార్లతో హైదరాబాద్.. టాప్-5 స్థానాల్లో నిలిచాయి.
అంతకుముందు 2020లో 4,420 యూనిట్లతో ఢిల్లీ, 2021లో 1700 యూనిట్లతో ముంబై మొదటి స్థానాల్లో ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్ల మోడల్స్ పెరగడం, ఈవీ చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుదల, ఈవీ కార్ల వాడకం వైపు క్రమంగా మొగ్గుతున్న కస్టమర్లు తదితర కారణాలు దేశంలో ఈవీ కార్ల కొనుగోళ్లు పెరగడానికి కారణాలుగా ఉన్నాయి.