Honda-Hero Moto Corp | ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఇప్పటి వరకూ అత్యధిక మార్కెట్ వాటా గల హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) వెనక బడింది. ద్విచక్ర వాహనాల విక్రయంలో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) మొదటి స్థానంలోకి వచ్చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై మధ్య కాలంలో అమ్ముడైన ద్విచక్ర వాహనాల్లో హోండా ముందు వరుసలో నిలిచింది. గత నాలుగు నెలల్లో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 18.53 లక్షల యూనిట్లు విక్రయించింది.
హోండా కంటే హీరో మోటో కార్ప్ సుమారు 21,653 యూనిట్లు వెనుకబడి ఉన్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) నివేదించింది. విదేశాలకు మోటారు సైకిళ్లు, స్కూటర్ల ఎగుమతితో కలుపుకుంటే రెండు సంస్థల మధ్య తేడా 1.3 లక్షల పై చిలుకే. దీనిపై స్పందించడానికి హీరో మోటో కార్ప్, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అధికార ప్రతినిధులు నిరాకరించారు. 26 ఏండ్ల సుదీర్ఘ భాగస్వామ్యం తర్వాత 2011 జనవరిలో హీరో మోటో కార్ప్, హోండా మోటార్స్ (జపాన్) విడిపోవాలని నిర్ణయించుకున్నాయి. 2011కి ముందు రెండు కంపెనీల భాగస్వామ్యంతో హీరో హోండా అనే కంపెనీ ఉండేది.
త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజా గణాంకాలు ఆయా సంస్థల విక్రయాలపై ప్రభావం చూపుతాయని ఆటోమొబైల్ రంగ నిపుణులు చెబుతున్నారు. సుదీర్ఘకాలంగా ద్విచక్ర వాహనాల రంగంలో మొదటి వరుసలో ఉన్న హీరో మోటో కార్ప్.. రెండో స్థానానికి పడిపోయిందని జాటో డైనమిక్స్ ప్రెసిడెంట్ రవి భాటియా చెప్పారు. పండుగల సీజన్ నేపథ్యంలో హీరో మోటో కార్ప్ రికవరీ దిశగా అడుగులేస్తున్నదన్నారు.
రూరల్, అర్బన్ మార్కెట్లలో డిమాండ్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ శృతి శాబూ చెప్పారు. గ్రామీణ ప్రాంత మార్కెట్లలో పరిస్థితి మెరుగవుతున్నది. పట్టణ మార్కెట్లలో స్కూటర్లతోపాటు మిడ్ నుంచి ప్రీమియం లెవల్ మోటారు సైకిళ్లకు గట్టి డిమాండ్ ఉందన్నారు.
హోల్ సేల్ విక్రయాల్లో హోండా ముందు నిలుస్తున్నా, రిటైల్ మార్కెట్ విక్రయాల్లో హీరో మోటో కార్ప్ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఏప్రిల్ నుంచి జనవరి వరకూ హీరో మోటోకార్ప్ 17.5 లక్షలకు పైగా మోటారు సైకిళ్లు, స్కూటర్లు విక్రయిస్తే, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా 15 లక్షల యూనిట్లకు పరిమితమైందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేసన్స్ (ఫాడా0 తెలిపింది. రెండు సంస్థల మధ్య వ్యత్యాసం సుమారు 2.5 లక్షల యూనిట్లు ఉంటుంది. ఏప్రిల్ లో 20 శాతం పెరిగిన హోండా మార్కెట్ జూలైలో 24.3 శాతానికి దూసుకెళ్లింది. మరోవైపు హీరో మోటో కార్ప్ వాటా ఏప్రిల్ లో 33 శాతానికి పైగా తగ్గితే, జూలైలో అది 29.4 శాతానికి చేరుకున్నది. పండుగల సీజన్ లో ద్విచక్ర వాహనాల విక్రయంలో రెండు సంస్థల మధ్య పోటాపోటీ వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు.