ఆరంభ పెట్టుబడుల్లో అప్పుడే విజయం
మార్కెట్లో తొలిసారి మదుపు చేయాలనుకున్నప్పుడు వచ్చే సందేహాలు అనేకం. సమాచారం చాలా ఎక్కువగా లభించడంతో తికమకలు సహజంగానే ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ల సాయంతో కూడా మదుపు మార్గంలో విజయం సాధించవచ్చు. ఈ దిగువ అంశాలపై ఆధారపడి మీరే నిర్ణయాలూ తీసుకోవచ్చు.
దీర్ఘకాల పెట్టుబడులు
మార్కెట్లో ఎప్పుడు మదుపు చేస్తే అధిక రాబడి వస్తుందో చెప్పడం కష్టం. అలాగే రాబడులకు గ్యారంటీలు ఉండవు. మార్కెట్ పతనంలో కనీస స్థాయిల కోసం వేచిచూస్తే అవకాశాలు మిస్సవడం ఖాయం. మార్కెట్లో ఎప్పుడు మదుపు చేయాలి?.. ఎప్పుడు విరమించుకోవాలి?.. అని చెప్పడం నిపుణులకు కూడా సాధ్యం కాదు. స్వల్పకాలిక ఒడిదుడుకులను పట్టించుకోకుండా దీర్ఘకాలానికి మదుపు చేస్తే సంపద సృష్టి సాధ్యమవుతుంది. దీర్ఘకాలంలో రాబడి ఇవ్వని ఆర్థిక సాధనం ఏదీ లేదు. ఈ సత్యాన్ని గ్రహించి మదుపు చేస్తూనే ఉండండి.
డైవర్సిఫికేషన్
పోర్టుఫోలియోను నిర్మించేటప్పుడు డైవర్సిఫికేషన్ చాలా ముఖ్యం. నిధులన్నింటినీ ఒకే సాధనంలో మదుపు చేస్తే జరిగే అనర్థాలు అనేకం. ఒకే రకమైన అనేక మ్యూచువల్ ఫండ్ స్కీములను కలిగి ఉండటం కన్నా ఇండెక్స్ ఫండ్లు, సెక్టార్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్లు, డెట్ ఫండ్ ఇలా అనేక రకాల ఫండ్లను కలిగి ఉండటం వల్ల రిస్క్ తగ్గిపోయి రాబడులు ఆశించిన మేరకు ఉంటాయి.
అసెట్ అలోకేషన్
ఒకే అసెట్‌లో కాకుండా వివిధ అసెట్లలో మదుపు చేయడం మరో రకమైన డైవర్సిఫికేషన్. కొన్ని అసెట్లు విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఈక్విటీ మార్కెట్లు పతనం అవుతున్నప్పడు బంగారం ధర పెరుగుతూ ఉంటుంది. అందుకని స్థిరంగా రాబడులను ఇవ్వగలిగే పోర్టుఫోలియోను నిర్మించుకోవడంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించాలి.
రిస్క్ మంచిదే
రిస్క్, రిటర్న్‌లు రెండూ అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. తక్కువ రిస్క్ తక్కువ రాబడి, అధిక రిస్క్ అధిక రాబడి అనేది సూత్రం. అసలు రిస్క్‌లేని ఇన్వెస్ట్మెంట్ అంటూ లేదు.