Raksha Bandhan | అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనురాగానికి, అనుబంధం గురించి మాటల్లో చెప్పలేం. వారి మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది రక్షా బంధన్. రక్షా బంధన్ నాడు తనకు రాఖీ కట్టిన సోదరికి అన్నలు, తమ్ముళ్లు గిఫ్ట్ ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నెల 19న జరిగే రక్షా బంధన్ నాడూ ప్రతియేటా ఇచ్చే బహమతులకు బదులు.. తమ సోదరీమణులకు సుదీర్ఘకాలం ఆర్థిక భరోసా కల్పించే బహుమతులు ఇస్తే.. అనూహ్య పరిస్థితుల్లో అండగా నిలిచే బీమాతో ధీమా కల్పిస్తే చాలా బాగుంటుంది. అందుకు వివిధ పెట్టుబడి పథకాలు.. మ్యూచువల్ ఫండ్స్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకంలో సోదరి పేరిట పొదుపు వంటి బహమతులు ఇవ్వొచ్చు. ఈ పెట్టుబడి ఆప్షన్లపై ఓ లుక్కేద్దామా..
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న పెట్టుబడి పథకాల్లో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. వాటిల్లో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) ద్వారా సోదరీమణులకు సోదరులు బహుమతి ఇవ్వొచ్చు. రక్షా బంధన్ నాడే మీ సోదరి పేరిట మీ శక్తి సామర్థ్యాలను బట్టి పెట్టుబడి ప్రారంభిస్తే.. ఆమె తన దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో సహాయకారిగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ తోపాటు సురక్షిత పెట్టబుడి ఆప్షన్ ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలు. వీటితో స్థిరమైన ఆదాయంతోపాటు పలు ప్రయోజనాలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లోనే ఆదుకునేందుకు ఎమర్జెన్సీ ఫండ్ గా ఉపకరిస్తుంది.
మహిళల కేసం కేంద్రం ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్’ పథకం తెచ్చింది. ఈ పథకంలో మీ అక్క లేదా చెల్లెలు పేరిట సేవింగ్స్ ప్రారంభించండి. ఈ పథకం కింద మదుపు చేసే పొదుపుపై.. సాధారణ బ్యాంకు ఖాతాలు, ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే ఆకర్షణీయ వడ్డీ రేట్లు అందిస్తాయి. ఈ పథకంలో మదుపు ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంతో మీ సోదరీమణులకు భవిష్యత్ లో ఆర్థికంగా భరోసా కల్పిస్తుంది. ప్రతి ఏడాది మాదిరిగా ఏదో ఒక బహుమతి ఇవ్వడానికి బదులు మీ సోదరి పేరిట స్టాక్స్ కొనుగోలు చేయండి. మంచి కంపెనీల్లో స్టాక్స్ లో పెట్టుబడితో వారు సంపద పెంచుకునే అవకాశం కల్పించినట్లే..
రక్షా బంధన్ సందర్భంగా సోదరులు తమ అక్కా చెల్లెళ్లకు బంగారం కానుకగా ఇవ్వాలనుకుంటారు. ఇవి వారికి శాశ్వత బహుమతులుగా ఉంటాయి. అంతే కాదు ఆర్థిక అనిశ్చితి వేళలో ఈ ఆభరణాలు వారికి అండగా ఉండటంతోపాటు ఆర్థిక భరోసా కల్పిస్తాయి. సోదరీమణుల ఆరోగ్యానికి, వారి భవిష్యత్ కు భరోసా కల్పించడంలో బీమా తోడు ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొని ఇస్తే చాలా బాగుంటుంది. మున్ముందు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మీ సోదరికి భరోసానిస్తుంది.