Fixed Deposit | చాలాకాలం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును తగ్గించింది. గత రెండు ద్రవ్యసమీక్షల్లో పావు శాతం చొప్పున అర శాతం కోత పెట్టింది. దీంతో ఆయా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ రుణాలపైనా వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలో సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై కూడా వడ్డీరేట్లను దించుతున్నాయి.
ఫలితంగా ఇన్నాళ్లూ ఎఫ్డీలపై అధిక వడ్డీ ఆదాయాన్ని పొందినవారికి కాస్త ఇబ్బందికరంగానే ఉంటున్నది. ముఖ్యంగా ఎఫ్డీల ఆదాయమే ప్రధానంగా జీవనం సాగించే ఎంతోమంది సీనియర్ సిటిజన్లు నష్టపోతున్నారు. అయితే ఇప్పటికీ ఎఫ్డీలపై ఆకర్షణీయ వడ్డీరేట్లను కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అమలు చేస్తున్నాయి.
సీనియర్ సిటిజన్లకు మూడేండ్ల కాలపరిమితికిగాను చేసే ఎఫ్డీలపై ఆయా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 9.1 శాతం నుంచి 8.25 శాతం వరకు వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి. నిజానికి ప్రధాన వాణిజ్య బ్యాంకుల్లో ఈ స్థాయిలో వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నవి పెద్దగా లేవనే చెప్పవచ్చు. కానీ చిన్న బ్యాంకులు ఇందుకు భిన్నంగా కస్టమర్లను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గరిష్ఠంగా 9.1 శాతం వడ్డీరేటును అందిస్తున్నది. అయితే ఎఫ్డీ విలువ రూ.3 కోట్లను దాటరాదు. అలాగే నార్త్ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 9 శాతం వరకు వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నది. ఇక జన, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 8.75 శాతం వరకు, యునిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.65 శాతం వరకు వడ్డీరేట్లను చెల్లిస్తున్నాయి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.25 శాతం వరకు వడ్డీరేటును ప్రకటించింది.