Fixed Diposits | గత మూడు నెలల్లో భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రెపోరేట్ 140 పాయింట్లు పెంచింది. దీంతో ఆర్బీఐ రెపోరేట్ 5.40 శాతానికి చేరుకున్నది. దీనికి అనుగుణంగా పలు బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచేశాయి. ఈ పరిణామం సీనియర్ సిటిజన్లకు రిలీఫ్ కల్పించింది. రిటైర్మెంట్ తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లలో డిపాజిట్లపై వడ్డీయే సీనియర్ సిటిజన్లకు ఆదాయ వనరు. సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్‌లో తమ జీవిత కాల సేవింగ్స్‌ను సీనియర్ సిటిజన్లు ఫిక్స్డ్ డిపాజిట్లుగా మదుపు చేస్తారు. పలు బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై 30-40 బేసిక్ పాయింట్లు అధిక వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని సార్లు మెచ్యూరిటీ పీరియడ్, డిపాజిట్ మొత్తం ఆధారంగా వడ్డీరేటు ఖరారవుతుంది. సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్న బ్యాంకులేవో ఓ లుక్కేద్దాం.. !
ప్రైవేట్ రంగ బ్యాంక్.. ఇండస్ ఇండ్ బ్యాంక్.. 60 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీరేట్లతో కూడిన ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు ప్రారంభించింది. ఎన్నార్వో డిపాజిట్లకు ఈ వడ్డీరేట్లు వర్తించవు. సీనియర్ సిటిజన్లు చేసే రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీ లభిస్తుంది. 18 నెలల నుంచి 19 నెలల్లోపు, 19 నెలల నుంచి రెండేండ్ల లోపు, రెండేండ్ల నుంచి 30 నెలల లోపు, 30 నెలల నుంచి 33 నెలలు, 33 నెలల నుంచి మూడేండ్లు, మూడేండ్ల నుంచి 61 నెలల్లోపు. 61 నెలల నుంచి అంత కంటే ఎక్కువ గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లకు ఈ 7.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇండస్ టాక్స్ ఆదా పథకం ( ఐదేండ్లు) కింద డిపాజిట్లపైనా 7.50 శాతం వడ్డీ పొందొచ్చు.
సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై డీసీబీ బ్యాంక్ 7.10 శాతం వడ్డీ అందిస్తున్నది. 18 నెలల నుంచి 700 రోజులు, 700 రోజుల నుంచి 36 నెలల్లోపు, 36 నెలల నుంచి 60 నెలల్లోపు, 60 నెలల నుంచి 120 నెలల వరకు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూరిటీ పొందిన తర్వాత 7.10 శాతం వడ్డీ పొందొచ్చు.
ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్న బ్యాంకుల్లో ఆర్బీఎల్ బ్యాంక్ ఒకటి. గరిష్టంగా 24 నెలల నుంచి 36 నెలల్లోపు రూ.2 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ అందిస్తున్నది. 36 నెలల నుంచి 60 నెలల్లోపు, 60 నెలల నుంచి 1826 రోజులకు రూ.2 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.05 శాతం వడ్డీ పొందొచ్చు. దీంతోపాటు 60 నెలల గడువు గల టాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంపైనా 7.05 శాతం వడ్డీ లభిస్తుంది.
390 రోజుల నుంచి 23 నెలల్లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆరు శాతం వడ్డీ, 23 నెలల నుంచి రెండేండ్ల లోపు 6.10 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది కొటక్ మహీంద్రా బ్యాంక్. 2-10 ఏండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆరు శాతం పొందొచ్చు.