Rupay Credit Card | గతంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి వద్ద ఒక క్రెడిట్ కార్డు తప్పనిసరిగా ఉంటున్నది. ఇంతకుముందు క్రెడిట్ కార్డు నెట్ వర్క్‌ల్లో మాస్టర్ కార్డ్, వీసాలదే పై చేయి. దేశీయంగా ఆర్బీఐ ఎంతో కాలం క్రితం డెవలప్ చేసిన రూపే నెట్‌వర్క్‌ను ఆదరించిన వారే లేరు.. కానీ ప్రస్తుతం రూపే క్రెడిట్ కార్డులకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ కావడం.. మొబైల్ యాప్స్ ఆధారిత యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. యూపీఐ పేమెంట్స్ కోసం రూపే క్రెడిట్ కార్డులను ఆర్బీఐ అనుమతించడమే దీనికి కారణం. బ్యాంకులన్నీ ప్రస్తుతం రూపే క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి.
ఇంతకుముందు సాధారణ బ్యాంక్ ఖాతాల నుంచి మాత్రమే యూపీఐ పేమెంట్స్ చేయడానికి అవకాశం ఉండేది. క్రెడిట్ కార్డులను అనుసంధానించడానికి నిబంధనలు అనుమతించవు. కానీ, రూపే క్రెడిట్ కార్డులతో యూపీఐ చెల్లింపులు చేసేయొచ్చు.. అంటూ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భారత్ పే తదితర ఏ యూపీఐ యాప్‌నైనా రూపే క్రెడిట్ కార్డుతో అనుసంధానించవచ్చు.. ఎక్కడైనా స్కాన్ చేసి నేరుగా పేమెంట్స్ చేసేయొచ్చు. కానీ, వ్యక్తిగతంగా ఇతరులకు పంపడానికి కానీ, వ్యాలెట్ లోడ్ చేసుకోవడానికి అవకాశం లేదు. రూపే క్రెడిట్ కార్డును యూపీఐకు అనుసంధానించడంతో లభించే బెనిఫిట్లేమిటో చూద్దాం..
రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ యాప్‌తో అనుసంధానించడంతో తేలిగ్గా చెల్లింపులు చేసేయొచ్చు. ఒకచోట యూపీఐ యాప్, మరో చోట క్రెడిట్ కార్డు వాడనవసరం లేదు. చేతిలో ఫోన్‌తో చెల్లింపులు చేసేయవచ్చు. ప్రతి చోటకు క్రెడిట్ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.
రూపే క్రెడిట్ కార్డు ద్వారా జరిపే యూపీఐ లావాదేవీలపై రివార్డు పాయింట్లు లభిస్తాయి.
పాయింట్ ఆఫ్ సేల్ కార్డు స్వైప్ మిషన్లు లేని చిన్న దుకాణాల్లో యూపీఐ ద్వారా రూపే క్రెడిట్ కార్డులు వాడొచ్చు. కొన్ని చోట్ల క్రెడిట్ కార్డులపై రెండు శాతం వరకూ ఎండీఆర్ చార్జీలు వసూలు చేస్తారు. రూపే క్రెడిట్ కార్డు పేమెంట్స్‌తో ఈ పరిస్థితి తలెత్తదు.
మీ ఖర్చులు తెలుసుకోవడానికి రూపే క్రెడిట్ కార్డు ఉపకరిస్తుంది. నెలవారీ ఖర్చులకు ఒక లిమిట్ ఖరారు చేసుకుని, అంత వరకూ పేమెంట్స్ చేయవచ్చు. బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డు వాడకం వల్ల ట్రాక్ చేయడం సాధ్యం కాదు.
ఎమర్జెన్సీలో బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో డబ్బు లేకుంటే రూపే క్రెడిట్ కార్డులు ఉపయోగ పడతాయి. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపునకు ఉండే గడువు.. సంబంధిత వ్యక్తికి రిలీఫ్ ఇస్తుంది.
అలాగే క్రెడిట్ కార్డు వాడుతున్నప్పుడు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగాలి. యూపీఐ యాప్‌తో అనుసంధానించినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. యూపీఐ యాప్ తో లింక్ చేయడం వల్ల అధికంగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. అలా చేస్తే అప్పుల ఊబిలో చిక్కుకోవచ్చు. ఖర్చులపై నియంత్రణ ఉంటేనే క్రెడిట్ కార్డు వాడటానికి ముందుకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు.