Minister Sridhar Babu | హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : అమెరికాకు చెందిన థెర్పోఫిషర్ సైంటిఫిక్..హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో బయోప్రాసెస్ డిజైన్ సెంటర్ను నెలకొల్పడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ డిజైన్ సెంటర్ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంనాటికి అందుబాటులోకి రానున్నట్లు మంత్రి చెప్పారు.
ప్రధానంగా ఔషధ పరిశ్రమకు, రోగనిర్థారణ పరీక్షలకు అవసరమైన పరికరాలు, రసాయనాలు సరఫరా చేస్తున్న ఈ సంస్థ ఏర్పాటు చేస్తున్న డిజైన్ సెంటర్లో స్థానిక ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న ఈ సంస్థ దేశంలో అడుగుపెట్టడానికి ముఖ్యంగా తెలంగాణను ఎంచుకోవడం సంతోషదాయకమని చెప్పారు.